Gaza : ఇజ్రాయిల్‌ రక్షణ మంత్రితో భేటీ కానున్న అమెరికా

వాషింగ్టన్‌  :      అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి లాయిడ్‌ ఆస్టిన్‌ మంగళవారం ఇజ్రాయిల్‌ రక్షణ మంత్రితో మంగళవారం సమావేశం కానున్నారు. దక్షిణ గాజా నగరమైన రఫాపై భూతల దాడులు  మినహా ఇతర మార్గాల్లో హమాస్‌ను ఓడించడంపై చర్చ జరపనున్నట్లు పెంటగాన్‌ ఓ ప్రకటనలో తెలిపింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఈ వారంలో అమెరికాలో చేపట్టనున్న పర్యటనను ఇజ్రాయిల్‌ రద్దు చేసినప్పటికీ.. ఆ దేశ రక్షణ మంత్రి యోవ్‌ గాలెంట్‌తో ఆస్టిన్‌ సమావేశం కొనసాగుందనిపెంటగాన్‌ మీడియా కార్యదర్శి మేజర్‌ జనరల్‌ పాట్‌ రైడర్‌ పేర్కొన్నారు. హమాస్‌ను బెదిరించేందుకు అనేక మార్గాలు ఉన్నాయని, అయితే పౌరుల భద్రతపై కూడా బాధ్యత వహించాలని అన్నారు. పట్టణ పరిసరాలలో కార్యకలాపాలు నిర్వహించడంతో చాలా పాఠాలు , సొంతంగాను నేర్చుకున్నామని పాట్‌ రైడర్‌ పేర్కొన్నారు. చర్చలతో సమస్యను పరిష్కరించవచ్చని కోరుకుంటున్నట్లు తెలిపారు. రఫాలోకి వెళ్లకుండా హమాస్‌ను ఓడించలేమని ఇజ్రాయిల్‌ పేర్కొంటోందని, అక్కడ వేలాది మంది యోథులతో కూడిన నాలుగు బెటాలియన్లు ఉన్నట్లు వెల్లడించిందని అన్నారు.

ఇజ్రాయిల్‌ హమాస్‌ మధ్య తక్షణమే కాల్పుల విరమణ జరగాలని కోరుతూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సోమవారం తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. భద్రతా మండలి ఇటువంటి తీర్మానాన్ని ఆమోదించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఈ తీర్మానంపై ఓటింగ్‌కు అమెరికా గైర్హాజరు కాగా, 14 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహూ ఉన్నతస్థాయి అధికారుల పర్యటనను రద్దు చేసిన సంగతి తెలిసిందే.

ఈ వారంలో ఉన్నత స్థాయి ప్రతినిధుల పర్యటనను రద్దు చేస్తూ ఇజ్రాయిల్‌ తీసుకున్న నిర్ణయంపై అమెరికా అసంతృప్తి వ్యక్తం చేసిందని వైట్‌ హౌస్‌ జాతీయ భద్రతా ప్రతినిధి జాన్‌ కిర్బీ పేర్కొన్నారు. ఇజ్రాయిల్‌ రక్షణ మంత్రి గాలంట్‌తో అమెరికా జరిపే చర్చల్లో రఫాపై దాడుల అంశం కూడా వుండవచ్చని ఆయన అన్నారు.

➡️