హంగరీ అధ్యక్ష పదవికి కటాలిన్‌ నోవాక్‌ రాజీనామా

Feb 12,2024 10:54 #Hungary, #President
Katalin Novak resigns as president of Hungary

హంగరీ : ఒక చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన దుండగుడికి హంగరీ ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టడం ఉద్రిక్తతలకు దారితీసింది. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో హంగరీ దేశాధ్యక్షులు కటాలిన్‌ నోవాక్‌ రాజీనామా చేశారు. ప్రజలను ఏ విధంగానూ నొప్పించే ఉద్దేశం తనకు లేదని ఈ సందర్భంగా ఆమె అన్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..కొంతకాలం క్రితం ఓ బాలల సంరక్షణాలయ ప్రధాన అధికారి అక్కడి చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడన్న ఆరోపణలు వెలువెత్తాయి. ఈ దారుణాన్ని కప్పిపుచ్చేందుకు అధికారికి సహకరించిన మరో ఉద్యోగికి ప్రభుత్వ సూచన మేరకు ఆ దేశ అధ్యక్షులు కటాలిన్‌ నోవాక్‌ క్షమాభిక్ష ప్రసాదించారు. ఇటీవలే ఓ వెబ్‌ సైట్‌ ఈ విషయాన్ని బయటపెట్టడంతో దేశంలో ఒక్కసారిగా కలకలం రేగింది. వెంటనే ప్రధాని రాజీనామా చేయాలంటూ … ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. గత శుక్రవారం నిరసనకారులంతా కలిసి అధ్యక్ష నివాసం ఎదుట ధర్నాకు దిగారు. ప్రధానితో పాటూ అధికార పక్షం మొత్తం ఈ ఘటనకు బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. వరల్డ్‌ పోలో ఛాంపియన్‌షిప్స్‌లో భాగంగా … హంగరీ మ్యాచ్‌ను చూడటానికి కటాలిన్‌ నోవాక్‌ ఖతర్‌కు వెళ్లారు. దేశంలో ఉద్రిక్త పరిస్థితులు, నిరసనల గురించి తెలిసిన వెంటనే ఆమె హుటాహుటిన స్వదేశానికి చేరుకున్నారు. శనివారం విమానం దిగిన వెంటనే తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రజలను నొప్పించాలన్నది తన ఉద్దేశం కాదని అన్నారు. హంగరీ ప్రభుత్వాధికారం ప్రధాని చేతుల్లో ఉంటుందని తెలిపారు. అధ్యక్షులకు నామమాత్రపు అధికారాలు మాత్రమే ఉంటాయని చెప్పారు. తన నిర్ణయంతో బాధపడినవారందికీ క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. మార్చి 2022లో కటాలిన్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఓ మహిళకు ఈ బాధ్యతలు దక్కడం చరిత్రలో ఇదే తొలిసారి. ఇదిలా ఉంటే, ప్రధాని విక్టర్‌ ఆస్బార్న్‌కు ప్రధాన మద్దతుదారుగా ఉన్న కటాలిన్‌ రాజీనామా చేయడం పరిస్థితులను మరింత ఉద్రిక్తంగా మార్చింది. అయితే … ప్రధాని కూడా గద్దెదిగాలంటూ ప్రతిపక్షాలు నిరసనలు కొనసాగిస్తున్నాయి.

➡️