మాల్దీవుల ప్రాసిక్యూటర్‌ జనరల్‌పై దాడి

Jan 31,2024 11:39 #Maldives, #Prosecutor General

మాలె :    గత ప్రభుత్వం నియమించిన మాల్దీవుల ప్రాసిక్యూటర్‌ జనరల్‌ హుస్సేన్‌ షమీమ్‌ దాడి జరిగింది.  బుధవారం ఉదయం షమీమ్‌ వ్యాయామం చేస్తుండగా గుర్తుతెలియని దుండగులు కత్తితో పొడిచినట్లు స్థానిక మీడియా తెలిపింది. ప్రస్తుతం ఆయన ఎడికె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ప్రకటించింది.

స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. షమీమ్‌పై తెల్లవారుజామున దాడి జరిగింది. నగర వీధుల్లో పదునైన వస్తువుతో దాడి చేశారు. ఎడికె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని మాల్దీవుల పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు.

2019లో మాల్దీవియన్‌ డెమోక్రటిక్‌ పార్టీ (ఎండిపి) అధికారంలో ఉన్న సమయంలో అప్పటి అధ్యక్షుడు ఇబ్రహీం సోలిహ్  ..  షమీమ్‌ను ప్రాసిక్యూటర్‌ జనరల్‌గా నియమించారు.  ఆయన పదవీకాలం నవంబర్‌ వరకు ఉంది.  ఎండిపి ప్రస్తుత మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్‌ ముయిజ్జుపై అభిశంసన ప్రక్రియను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

గత ఆదివారం ముయిజ్జు ప్రభుత్వంలో ముగ్గురు మంత్రుల నియామకాన్ని పార్లమెంట్‌ తిరస్కరించింది. దీంతో అధికార పార్టీలైన పిఎన్‌సి-పిపిఎం సభ్యులు ఎండిపి సభ్యులతో ఘర్షణకు దిగారు. ఎంపిల తోపులాటలు, ముష్టిఘాతాల దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. పలువురు సభ్యులు గాయపడటంతో వారిని చికిత్స నిమిత్తం తరలించారు. దేశంలోనూ హింసాత్మక పరిస్థితులు పెరుగుతున్న సమయంలో ఈ దాడి ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

➡️