Floods – రష్యాను ముంచెత్తిన వరదలు – 4 వేలకుపైగా ప్రజలు సురక్షితం

Apr 7,2024 08:37 #floods, #peoples, #russia, #safe

రష్యా : రష్యాను వరద ముంచెత్తింది. ఓరెన్‌బర్గ్‌ ప్రాంతంలో ఆనకట్ట తెగిపోవడంతో భారీగా వరదలు పోటెత్తాయి. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యింది. వరదలో చిక్కుకున్న సుమారు 4 వేలమందికిపైగా ప్రజలను రెస్క్యూ సిబ్బంది కాపాడారు. ఆకస్మాత్తుగా ఉరల్‌ నది వరద నీరు సమీప గ్రామాలలోకి ప్రవేశించడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు తమ ఇళ్లలోనే చిక్కుకుపోయారు. కజకిస్థాన్‌ సరిహద్దుకు సమీపంలోని ఓరెన్‌బర్గ్‌ ప్రాంతంలో ఆనకట్ట తెగిపోవడంతో భారీగా వరద పోటెత్తింది. దీనిపై.. ఓరెన్‌బర్గ్‌ గవర్నర్‌ కార్యాలయం శనివారం ఓ ప్రకటన చేసింది. ‘1,019 మంది పిల్లలతో సహా 4,208 మందిని రక్షించామన్నారు. 2500 కంటే ఎక్కువ ఇండ్లు వరదలో చిక్కుకున్నాయని చెప్పారు.


వరదలో కొట్టుకుపోయిన డ్యాం….
వరద ఉధృతికి ఓర్స్క్‌ ప్రాంతంలో ఒక డ్యామ్‌ కుప్పకూలింది. ఈ క్రమంలో.. అక్కడ ఉన్న 2 వేల మంది స్థానికులను ప్రావిన్షియల్‌ ప్రభుత్వం శనివారం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. గత శుక్రవారం, ఉరల్‌ పర్వతాలలోని అరెన్‌బర్గ్‌ ప్రాంతంలో ఉన్న ఆనకట్ట వరదలో కొట్టుకుపోవడంతో… నది ఒడ్డున నివసించే ప్రజలను ఖాళీ చేయాలని స్థానిక అధికారులు కోరారు. వెంటనే ఆ ప్రాంతాలన్నిటినీ ఖాళీ చేయించారు. ఆ డ్యామ్‌ కొట్టుకుపోవడానికి సరైన నిర్వహణ లేకపోవడమే కారణమని అధికారులు చెబుతున్నారు.

ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు : అధికారులు
వరద బీభత్సంలో ఎవరికి ప్రాణ నష్టం జరగలేదని స్థానిక అధికారులు శనివారం తెలిపారు. ఓర్స్క్‌లో ప్రజలకు సహాయం చేయడానికి, వరద పరిణామాలను ఎదుర్కోవటానికి అవసరమైన సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు.. డ్యామ్‌ దెబ్బతిన్న భాగాలపై అత్యవసర మరమ్మతు పనులు జరుగుతున్నాయని అధికారులు వివరించారు.

➡️