నవాజ్‌, బిలావల్‌ దోస్తీ

Feb 15,2024 07:46 #Pakistan
pakistan elections shehbaz as pm
  • ప్రధానిగా షెహబాజ్‌ 
  • ప్రజాతీర్పు చోరీ : ఇమ్రాన్‌

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు ఇమ్రాన్‌ఖాన్‌ వ్యతిరేకులంతా ఒక్కటయ్యారు. సైన్యం ప్రత్యక్ష, పరోక్ష ప్రమేయంతో నవాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని పాకిస్తాన్‌ ముస్లింలీగ్‌ (పిఎంఎల్‌-ఎన్‌), బిలావల్‌ భుట్టో జర్దారీ నేతృత్వంలోని పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ చేతులు కలిపాయి. ఈ రెండు పార్టీల మధ్య డీల్‌ కుదరడంతో నవాజ్‌ షరీఫ్‌ తన సోదరుడు మాజీ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌నుa ప్రధాని పదవికి నామినేట్‌ చేస్తున్న్టట్లు ప్రకటించారు. తన కుమార్తె నవాజ్‌ను పంజాబ్‌ ప్రావిన్స్‌ ముఖ్యమంత్రిగా నామినేట్‌ చేశారు. ఈ మేరకు పార్టీ ప్రతినిధి మరియం ఔరంగజేబ్‌ ఎక్స్‌కు తెలిపారు. ఇమ్రాన్‌ఖాన్‌ నేతృత్వంలోని పాకిస్తాన్‌ తెహ్రీక్‌ ఇ ఇన్సాఫ్‌ (పిటిఐ) ప్రజా తీర్పును ఈ రెండు పార్టీలు దొంగిలించాయని విమర్శించింది. ఎన్నికల్లో పిటిఐ మద్దతునిచ్చిన ఇండిపెండెంట్‌ అభ్యర్ధులు 93 మంది గెలిచి అతిపెద్ద గ్రూపుగా వున్నప్పటికీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవరసరమైన సాధారణ మెజార్టీ మార్క్‌ 133కి చేరుకోలేకపోయింది. అటు పిఎంఎల్‌తో కానీ ఇటు పిపిపితో కానీ చేరేది లేదని పిటిఐ స్పష్టం చేసింది. పిఎంఎల్‌-ఎన్‌ కు 75 సీట్లు రాగా, పిటిఐకి చెందిన కొందరి ఇండిపెండెంట్లను తన వైపు తిప్పుకుని 80కి తన బలాన్ని పెంచుకుంది. 54 సీట్లతో మూడో స్థానంలో ఉన్న పిపిపితో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. అంశాల వారీ మద్దతు ఇచ్చేందుకు పిపిపి అంగీకరించింది. ఇమ్రాన్‌ను అధికారంలోకి రానీయకుండా ఎన్నికల ముందు, ఎన్నికల తరువాత అనేక అక్రమాలకు పాల్పడిన సైన్యం ఇప్పుడు పిఎంఎల్‌(ఎన్‌), పిపిపిలను ఒక దగ్గరకు చేర్చడంలో తెరవెనక పాత్ర పోషించినట్లు పరిశీలకులు పేర్కొంటున్నారు.

➡️