కాల్పుల విరమణకై ఇజ్రాయిల్‌పై ఒత్తిడి తేవాలి

  • అలీన దేశాలకు పాలస్తీనా రాయబారి విజ్ఞప్తి

కంపాలా : గాజాలో తక్షణమే కాల్పుల విరమణ అమలు చేసేలా ఇజ్రాయిల్‌పై ఒత్తిడి తీసుకురావాలంటూ ఐక్యరాజ్య సమితిలో పాలస్తీనా రాయబారి రియాద్‌ హెచ్‌.మన్సూర్‌ అలీనోద్యమ దేశాలకు విజ్ఞప్తి చేశారు. ఈ వారమంతా జరగనున్న అలీన దేశాల సదస్సులో సోమవారం ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ, భద్రతామండలి తీర్మానాలు చేసినప్పటికీ ఇజ్రాయిల్‌ పట్టించుకోవడం లేదు. కంపాలాలో సమావేశమైన 120మంది సభ్యులనుద్దేశించి మన్సూర్‌ మాట్లాడుతూ, పాలస్తీనియన్లు ఇప్పటికీ ఇజ్రాయిల్‌ వలస పాలనలోనే వున్నారని అన్నారు. ‘మా ప్రజలపై ముఖ్యంగా గాజాలోని ప్రజలపై ఇజ్రాయిల్‌ సాగిస్తున్న మారణకాండను మనం చూస్తున్నాం.’ అని అన్నారు. ఇజ్రాయిల్‌ను విచారించాలంటూ అంతర్జాతీయ న్యాయ స్థానంలో కేసు వేసిన దక్షిణాఫ్రికాకు పాలస్తీనియన్లందరూ రుణపడి వుంటారని అన్నారు. ”మీరందరూ మీ దేశాల స్వాతంత్య్రాన్ని సాధించుకున్నారు. ఈ వలస పాలనను కూడా మీరు అంతమొందించాలి.” అని ఆయన కోరారు. వారం పొడవునా సాగే ఈ చర్చల క్రమానికి అంతిమంగా చివరి రోజున జరిగే సమావేశానికి 30 దేశాల అధినేతలు వస్తారని భావిస్తున్నారు.

➡️