కెటలానియా ప్రాంతీయ ఎన్నికల్లో సోషలిస్టుల ఘన విజయం

బార్సిలోనా : ఆదివారం జరిగిన కెటలానియా ప్రాంతీయ ఎన్నికల్లో స్పానిష్‌ సోషలిస్టు పార్టీ చారిత్రాత్మక విజయం సాధించింది. ఇదివరకెన్నడూ లేని రీతిలో స్పెయిన్‌ రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయిన ఆరేళ్ల తర్వాత కెటలానియా ప్రాంతంలోని వేర్పాటువాద పార్టీలపై సోషలిస్టు పార్టీ విజయాన్ని నమోదు చేసింది. మాజీ ప్రాంతీయ అధ్యక్షుడు కార్లెస్‌ పుడ్జెమాంట్‌కి చెందిన టుగెదర్‌ పార్టీ నేతృత్వంలో స్వాతంత్య్ర అనుకూల నాలుగు పార్టీలు మొత్తంగా 61 సీట్లను గెలవాల్సి వుంది. చాంబర్‌లో మెజారిటీకి 68సీట్లు అవసరం. మాజీ ఆరోగ్య మంత్రి సాల్వడార్‌ ఇల్లా నేతృత్వంలోని సోషలిస్టులు కెటనల్‌ ఎన్నికల్లోనే ఉత్తమ ఫలితాలు సాధించారు. మొత్తంగా 42 సీట్లు గెలిచారు. 2021లో కేవలం 33సీట్లు మాత్రమే గెలిచారు. అప్పుడు వారు ఎక్కువ ఓట్లు గెలుచుకున్నా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయారు. కెటలాన్‌ ఎన్నికల్లో సోషలిస్టులు ఓట్లు, సీట్లు గెలుచుకోవడం ఇదే మొదటిసారి. ఈ విజయంతో కెటలానియాలో కొత్త అధ్యాయం ఆరంభమవుతుందని ఇల్లా ప్రకటించారు. కెటలానియా అధ్యక్షుడిగా ఇలా బాధ్యతలు చేపట్టాలంటే ఇతర పార్టీల మద్దతు కూడా సోషలిస్టులకు అవసరం. 2012 నుండి బార్సిలోనాలో వేర్పాటువాదులే ప్రాంతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చారు. అప్పటి నుండి వరుసగా నాలుగు ప్రాంతీయ ఎన్నికల్లోనూ వారే గెలుస్తూ వచ్చారు.

➡️