విముక్త పాలస్తీనా కావాలి

Dec 1,2023 10:14 #Israel, #israel hamas war, #Palestine

పాలస్తీనియన్లకు బాసటగా నిలిచిన ప్రపంచ ప్రజలు
అంతర్జాతీయ సంఘీభావం దినోత్సవం సందర్భంగా నిరసనలు, ర్యాలీలు
శావో పాలో : అంతర్జాతీయ పాలస్తీనియన్ల సంఘీభావ దినోత్సవం సందర్భంగా పాలస్తీనాకు పూర్తి విముక్తి కల్పించాలని ప్రపంచ దేశాలు బుధవారం డిమాండ్‌ చేశాయి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రజా ఉద్యమాలన్నీ పాలస్తీనా ప్రజలకు బాసటగా నిలబడుతున్నాయి. ఇప్పటివరకు గాజాలో సాగుతున్న నరమేథంలో 15వేల మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. కాల్పుల విరమణకు తాత్కాలికంగా విరామం ఇచ్చినప్పటికీ ఇజ్రాయిలీ బలగాలు పాలస్తీనియన్లను చంపుతునే వున్నాయి. బుధవారం రాత్రి జరిగిన దాడిలో జెనిన్‌ శరణార్ధి శిబిరాన్ని లక్ష్యంగా చేసుకుని ఇద్దరు చిన్నారులను చంపేశారు. అరబ్‌, మాగెరబ్‌ ప్రాంతంవ్యాప్తంగా నిరసనలు, ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఇజ్రాయిల్‌తో సాధారణ సంబంధాల ప్రక్రియకు ముగింపు పలకాలని తమ ప్రభుత్వాలను ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. మొరాకోలో 17 నగరాల్లో నిరసన కార్యాచరణకు మొరాకన్‌ ఫ్రంట్‌ అగైనెస్ట్‌ నార్మలైజేషన్‌ అండ్‌ ఇన్‌ సపోర్ట్‌ ఆఫ్‌ పాలస్తీనా పిలుపిచ్చింది. విముక్త పాలస్తీనా కావాలంటూ రబత్‌ నగరంలో జరిగిన నిరసన కార్యాచరణలో ప్రజలు పిలుపిచ్చారు. పాలస్తీనాకు సంఘీభావంగా ట్యునిస్‌లో నవంబరు 29న వర్కర్స్‌ పార్టీ ఆఫ్‌ ట్యునీషియా పెద్దఎత్తున ప్రజా సమీకరణను చేపట్టింది. మాతృభూమిని దోచుకుంటున్న, ప్రజల గౌరవానికి భంగం కలిగిస్తున్న, సామ్రాజ్యవాదం నిస్సిగ్గుగా అందించే మద్దతుతో ఆటవిక యుద్దాన్ని చేస్తూ ప్రపంచ ప్రజల వివేకాన్ని సవాలు చేస్తున్న యూదు వలసవాదాన్ని పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ట్యునీషియా వర్కర్స్‌ పార్టీ ఒక ప్రకటన జారీ చేసింది. అణచివేతకు గురవుతున్న ప్రజల తరపున, అరబ్బుల తరపున పోరాడుతున్న పాలస్తీనా ప్రజలు విజయం సాధించాలని కోరుతూ అన్ని నగరాలు, గ్రామాల్లో ప్రదర్శనలు నిర్వహించాల్సిందిగా ప్రజలకు పిలుపునిచ్చింది. సెంట్రల్‌ వెస్ట్‌ బ్యాంక్‌ నగరమైన రమల్లాలో కూడా పెద్ద సంఖ్యలో జాతీయ, ఇస్లామిక్‌ బలగాలు, కార్మిక సంఘాలు, పౌర సంస్థలు, ప్రజా కమిటీలు ర్యాలీలు నిర్వహించాయి. పాలస్తీనా ప్రజలకు సంఘీభావం ప్రకటించాయి. ఇటలీవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో విద్యార్ధులు సమ్మెలు నిర్వహించారు. ఇజ్రాయిల్‌ విద్యా సంస్థలతో సంబంధాలు తెగతెంపులు చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. పాలస్తీనా ప్రజలకు సంఘీభావాన్ని ప్రకటించారు.

➡️