కూలిన ఇరాన్‌ అధ్యక్షుడి హెలికాప్టర్‌.. రైసీ పరిస్థితిపై ఆందోళన

May 20,2024 08:01 #helicopter crash, #Iran, #pm
  •  ప్రమాదానికి దట్టమైన పొగ మంచే కారణమన్న అధికార్లు
  •  ఘటనా స్థలానికి హుటాహుటిన సహాయక బృందాలు
  •  గాలింపు చర్యలకు ఆటంకంగా మారిన వాతావరణం

టెహ్రాన్‌ : ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీని తీసుకుని వెళ్తున్న హెలికాప్టర్‌ ఆదివారం అజర్‌బైజాన్‌ రిపబ్లిక్‌ సరిహద్దుల్లోని ఓ మారుమూల ప్రాంతంలో కూలిపోయింది. అయితే, ఈ ప్రమాదం నుంచి రైసీ బయటపడ్డారా లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదు. దట్టమైన పొగ మంచు వల్ల హెలికాప్టర్‌ను అత్యవసర ల్యాండింగ్‌కు యత్నించగా ఈ ప్రమాదం చోటచేసుకున్నట్లు ఇరాన్‌ ఆంతరంగిక భద్రతా మంత్రి అహ్మద్‌ వహిదీని ఉటంకిస్తూ జాతీయ టెలివిజన్‌ తెలిపింది. ఇరాన్‌ అధ్యక్షుడు అజర్‌ బైజాన్‌ అధ్యక్షడు ఇల్హామ్‌ అలియెవ్‌తో కలసి తూర్పు అజర్‌ బైజాన్‌లో ఒక డ్యామ్‌ను ఆదివారం ప్రారంభించాల్సి ఉంది. ఇందుకోసం పత్యేక హెలికాప్టర్‌లో రైసీ బయల్దేరి వెళ్తుండగా వాయువ్య ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు జాతీయ టెలివిజన్‌ తెలిపింది. హెలికాప్టర్‌లో . ఆయన వెంట ఇరాన్‌ , విదేశాంగ మంత్రి హుస్సేని అమీర్‌ అబ్దుల్లాహియాన్‌, తూర్పు అజర్‌ బైజాన్‌ రాష్ట్ర గవర్నరు, తబ్రిజ్‌ మత పెద్ద ఉన్నట్లు అధికారిక మీడియా తెలిపింది. హెలికాప్టర్‌ కూలిపోయిన ప్రాంతం అజర్‌ బైజాన్‌ సరిహద్దుల్లోని జోల్ఫా పట్టణానికి సమీపంలో ఉంది. ఇడి ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌కు 600 కి.మీ దూరంలో ఉంది. వార్త తెలియగానే ఘటనా స్థలానికి హుటా హుటిన సహాయక బృందాలు, ఎయిర్‌ అంబులెన్స్‌లను పంపారు. కానీ, వాతావరణం అసుకూలించని కారణంగా సహాయక బృందాలు అక్కడికి చేరుకోవడం, కష్టంగా ఉందని అధికారులు తెలిపారు. ప్రమాదంలో చిక్కుకున్న అధ్యక్షుడు రైసీ సురక్షితంగా బయటపడాలని కోరుతూ కొందరు ప్రార్థనలు నిర్వహించారు.

➡️