బ్రిటన్‌ ఎన్నికల్లో లేబర్‌ పార్టీకే ఎక్కువ అవకాశాలు

Jun 30,2024 23:30 #British elections, #Labor party

ఇస్లింగ్టన్‌ నుంచి ఇండిపెండెంట్‌గా జెరిమి కార్బిన్‌
లండన్‌: మరో మూడు రోజుల్లో జరగనున్న బ్రిటన్‌ పార్లమెంటు ఎన్నికల్లో పద్నాలుగేళ్ల టోరీల (కన్నర్వేటివ్స్‌) పాలనకు తెరపడనుందని, ప్రతిపక్ష లేబర్‌ పార్టీకి విజయావకాశాలు మెండుగా ఉన్నాయని పలు సర్వేలు వెల్లడించాయి.. కన్సర్వేటివ్‌ పార్టీకన్నా లేబర్‌ పార్టీ 20 శాతం ఓట్ల ఆధిక్యం కలిగివుందని మెజార్టీ ఒపీనియన్‌ పోల్స్‌ అభిప్రాయపడుతున్నాయి. రిషి సునాక్‌ నేతృత్వంలో కన్నర్వేటివ్‌ పార్టీ ఘోర పరాజయం పాలవడం తథ్యమనే భావన ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించడానికి ముందే సర్వత్రా నెలకొంది. కన్నర్వేటివ్‌ ప్రబుత్వం సంక్షేమంపై కోతలు, కార్మిక వ్యతిరేక విధానాలు, ప్రజలపై సంక్షోభ భారాలను మోపడం, కార్పొరేట్లకు భారీ రాయితీలు కల్పించడం వంటి చర్యలతో ఆ పార్టీ ప్రజల్లో భ్రష్టు పట్టిపోయిందని రాజకీయ వ్యాఖ్యాతలు పేర్కొంటున్నారు. కన్సర్వేటివ్‌ పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను కీర్‌ స్టార్మర్‌ నేతృత్వంలోని లేబర్‌ పార్టీ పూర్తిగా సొమ్ము చేసుకోగలిగే స్థితి లేదు. దీనికి కారణం స్టార్మర్‌ ప్రత్యామ్నాయ విధానాలను ప్రజల ముందుంచడంలో తటపటాయిస్తున్నాడు. లేబర్‌ పార్టీ మౌలిక లక్ష్యాల కోసం గట్టిగా నిలబడాలని వాదించిన వామపక్షవాది జెరిమి కార్బిన్‌ను, ఆయన అనుచరులను పార్టీ నాయకత్వ స్థానం నుంచే కాకుండా, ఏకంగా పార్టీ నుంచే బహిష్కరించారు. ఇజ్రాయిల్‌ గాజాలో సాగిస్తున్న దారుణ మారణ కాండను ఖండించడానికి లేదా పాలస్తీనీయులకు సంఘీభావంగా నిలవడానికి స్టార్మర్‌ సిద్ధం కాలేదు. ఇజ్రాయిల్‌ దాష్టీకాలకు వ్యతిరేకంగా బ్రిటన్‌ ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆగ్రహాన్ని గమనించకుండా టోరీల బాటలోనే ఆయన కూడా నడవడం పలు విమర్శలకు దారి తీసింది. బ్రిటన్‌ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న వామపక్ష వాది 75ఏళ్ల జెరిమి కార్బిన్‌ ఈ ఎన్నికల్లో ఇస్లింగ్టన్‌ నుంచి ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన బ్రిటన్‌ పార్లమెంటుకు 1983 నుంచి ఇప్పటివరకు వరుసగా ఎన్నికవుతూ వస్తున్నారు. లేబర్‌ పార్టీ నాయకుడిగా, పార్లమెంటులో ప్రతిపక్ష నేతగా 2015-2020 మధ్య పనిచేశారు. ఆయన ఎంతకాలం పని చేయాలనుకుంటే అంతకాలం ఆయనను ఎంపీగా ఎన్నుకుంటామని ఇస్లింగ్టన్‌ ఓటర్లు బాహాటంగానే చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో కలవరపరిచే అంశమేమిటంటే పచ్చి మితవాద రిఫార్మ్స్‌ పార్టీ వేగంగా ముందుకురావడం. ఆ పార్టీ ఎన్నికల ప్రకటన నాటికి 10 శాతం ఓట్లు వస్తాయని ఒక అంచనా. ఎన్నికల పోలింగ్‌ తేదీ సమీపించే కొద్దీ దాని దూకుడు పెరుగుతూ వస్తోంది. ఇప్పుడు ఆ పార్టీకి 15-20 శాతం ఓట్లు రావచ్చని కొన్ని సర్వేలు చెబుతున్నాయి.

➡️