Agitation – ప్రధాని రాజీనామా చేయాలి..మళ్లీ ఎన్నికలు పెట్టండి : ఇజ్రాయెల్‌లో ఆందోళన

ఇజ్రాయెల్‌ : ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ … హమాస్‌తో కొనసాగుతున్న యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ.. దేశంలో ముందస్తు ఎన్నికలకు పిలుపునిస్తూ … నిరసనకారులు భారీ ఎత్తున శనివారం ఆందోళన ఉధృతం చేశారు. హమాస్‌ చేతిలో బందీలుగా ఉన్న తమవారిని విడుదల చేయాలని నిరసనకారులు కోరారు. ఆందోళనకారులంతా భారీ ఎత్తున ఇజ్రాయెల్‌ వీధుల్లోకి చేరారు. టెల్‌ అవీవ్‌, సిజేరియా, హైఫా వీధుల్లోకి వచ్చి ప్లకార్డులు పట్టుకుని ప్రధాని నెతన్యాహుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బందీల కుటుంబాలు తమవారిని తిరిగి తీసుకురావాలని ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తెస్తున్నాయని కానీ బందీలను విడిపించడంలో నెతన్యాహు విఫలమయ్యారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దేశంలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ బ్యానర్లను ప్రదర్శించారు. ఇదిలా ఉండగా … తూర్పు లెబనాన్‌లోని బెకా వ్యాలీపై ఆదివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు చేసింది. సిరియా సరిహద్దుకు సమీపంలోని జనతా గ్రామంలో హిజ్బుల్లా శిక్షణా శిబిరాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్‌ దాడి చేసినట్లు వర్గాలు తెలిపాయి. అయితే, తూర్పు నగరమైన బాల్‌బెక్‌కు సమీపంలో ఉన్న సఫారి పట్టణంపై దాడి జరిగినట్లు తెలిపారు. ఇందులో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు.

➡️