ఇజ్రాయిల్‌తో వాణిజ్యాన్ని నిలిపివేసిన టర్కీ

May 4,2024 07:52 #Gaza, #humanitarian, #Israel, #Trade, #Turkey

అంకారా :   ఇజ్రాయిల్‌తో వాణిజ్యాన్ని నిలిపివేస్తున్నట్లు టర్కీ శుక్రవారం ప్రకటించింది. గాజాలో పెరుగుతున్న మానవతా సంక్షోభ పరిస్థితి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఇజ్రాయిల్‌కు ఎగుమతులు, ఆ దేశం నుండి దిగుమతులు పూర్తిగా నిలిపివేయనున్నట్లు టర్కీ వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ”ఇజ్రాయిల్‌కు సంబంధించిన ఎగుమతి, దిగుమతి లావాదేవీలు నిలిపివేయబడ్డాయి. అన్ని రకాల ఉత్పత్తులు దీని కిందకు వస్తాయి” అని పేర్కొంది. ఇజ్రాయిల్‌ ప్రభుత్వం గాజాకు నిరంతరాయంగా, తగినంత మానవతా సాయాన్ని అనుమతించేవరకు టర్కీ ఈ చర్యలను కచ్చితంగా, నిర్ణయాత్మకంగా అమలు చేస్తుందని వెల్లడించింది.

ఓడ రేవుల నుండి ఇజ్రాయిల్‌ ఎగుమతులు, దిగుమతులను అడ్డుకోవడం ద్వారా టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌ అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలను ఉల్లంఘించారని ఇజ్రాయెల్‌ విదేశాంగ మంత్రి ఆరోపణలను టర్కీ ఖండించింది. 2023లో రెండు దేశాల మధ్య వాణిజ్య పరిమాణం 6.8 బిలియన్‌ డాలర్లుగా ఉంది.

గత నెలలో, టర్కీ ఇజ్రాయిల్‌పై వాణిజ్య ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. గాజాకు ఎయిర్‌ డ్రాప్‌ ద్వారా అందిస్తున్న సాయంలో అంకారా పాల్గనడాన్ని, ఈప్రాంతంలో దాని సైనిక చర్యలను ఇజ్రాయిల్‌ అడ్డుకుందని టర్కీ పేర్కొంది.

➡️