కాల్పుల విరమణపై తీర్మానంపై ఐరాస జనరల్‌ అసెంబ్లీ సమావేశం

జెనీవా :   మానవతావాదంతో తక్షణమే కాల్పుల విరమణకు పిలుపునివ్వాలన్న డిమాండ్‌పై   ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ మంగళవారం సమావేశం కానుంది. 193 సభ్యులు కలిగిన జనరల్‌ అసెంబ్లీలో ఏ దేశానికి వీటో అధికారం లేదు. పాలస్తీనాపై గత రెండు నెలలుగా ఇజ్రాయిల్‌ అమానవీయంగా దాడులకు దిగుతున్న సంగతి తెలిసిందే. శాంతి కోసం ఒక్కతాటిపైకి రావాలని కోరుతూ ఐరాస జనరల్‌ అసెంబ్లీలో ఈజిప్ట్‌, మారిటానియాలు తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి.

గాజాలో ఇజ్రాయిల్‌ దాడులను ఆపడం కోసం ఐరాస భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అమెరికా వీటో చేసింది. గాజాలో తక్షణమే కాల్పుల విరమణ కోసం భద్రతా మండలిలో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ గత  శుక్రవారం తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, మండలిలోని మొత్తం 15 సభ్య దేశాలకు గాను 13 దేశాలు దీనికి అనుకూలంగా ఓటు వేశాయి. బ్రిటన్‌ ఓటింగ్‌కు దూరంగా ఉంది. భద్రతామండలిలో అయిదు శాశ్వత సభ్యదేశాల్లో ఒకటైన అమెరికా తన వీటో అధికారాన్ని ఉపయోగించి తీర్మానాన్ని అడ్డుకుంది. కాల్పుల విరమణతో హమాస్‌ మళ్లీ పుంజుకుంటుందని ఏమాత్రం పసలేని వాదనను అమెరికా ముందుకు తెచ్చింది.

➡️