భారత్‌ అంతరంగిక వ్యవహారాల్లో అమెరికా జోక్యం : రష్యా విమర్శ

May 10,2024 08:30 #russia

మాస్కో : భారత్‌ అంతరంగిక వ్యవహారల్లో, ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో అమెరికా జోక్యం చేసుకుంటోందని రష్యా విమర్శించింది. రష్యా, సౌదీ అరేబియా విధానాలను అనుసరించేందుకు భారత్‌ ప్రయత్నిస్తోందంటూ వాషింగ్టన్‌ పోస్ట్‌ ఇచ్చిన వార్తా కథనంపై స్పందిస్తూ రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మరియా జకరోవా పై వ్యాఖ్యలు చేశారు. భారతదేశ జాతీయ మనస్తత్వం, చరిత్ర గురించి అమెరికాకు అవగాహన లేదు. అందువల్లే భారత్‌లో మత స్వేచ్ఛ గురించి నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని ఆమె విమర్శించారు. న్యూఢిల్లీపై అమెరికా ప్రతీసారీ ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తూ వుంటుంది. భారతదేశం యొక్క చారిత్రక నేపథ్యాన్ని, వారి జాతీయ మనస్తత్వాన్ని సరిగా అర్ధం చేసుకోలేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల ప్రక్రియను సంక్లిష్టం చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆమె విమర్శించారు. వలసవాద కాలం నాటి మనస్తత్వ ధోరణి కారణంగానే ఇలా వ్యవహరిస్తోందన్నారు. గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూన్‌ను గతేడాది అమెరికా గడ్డపై హతమార్చేందుకు జరిగిన విఫల కుట్రకు సంబంధించి రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌ (రా) అధికారి పేరును వాషింగ్టన్‌ పోస్ట్‌ ప్రస్తావించింది. దీన్ని భారత్‌ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ కేసుపై దర్యాప్తు జరుగుతోందంటూ వాషింగ్టన్‌ పోస్ట్‌ కథనంలో అవాంఛనీయమైన, నిర్ధారించబడని ఆరోపణలు వున్నాయని భారత్‌ విదేశాంగ శాఖ పేర్కొంది.

➡️