తమిళనాడులో సీట్ల సర్దుబాటు ఖరారు

Mar 9,2024 22:01 #chennai, #election

– పుదుచ్చేరి సహా 10 స్థానాలు కాంగ్రెస్‌కు

– సిపిఎం, సిపిఐ, విసికె రెండేసి స్థానాలు

– ‘ఇండియా’ ఫోరానికి కమల్‌ పార్టీ మద్దతు

చెన్నయ్ : బిజెపిని ఓడించేందుకు ఏర్పాటైన ‘ఇండియా’ ఫోరం పక్షాలు రాష్ట్రాల వారీగా సయోధ్య పెంపొందించుకుంటూ దూసుకుపోతున్నాయి. తాజాగా తమిళనాడులో సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పుదుచ్చేరితో పాటు తమిళనాడులో 9 స్థానాలు కలిపి మొత్తం 10 స్థానాల్లో కాంగ్రెస్‌ పోటీ చేయనుంది. ఈ మేరకు తమిళనాడులోని అధికార డిఎంకెతో తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీ (టిఎన్‌సిసి) మధ్య శనివారం సాయంత్రం ఒప్పందం కుదిరింది. ఒప్పంద పత్రాలపై డిఎంకె అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌, టిఎన్‌సిసి అధ్యక్షులు సెల్వపెరుంథాగై సంతకాలు చేశారు. సీట్ల కేటాయింపు పట్ల తమకెంతో ఆనందంగా ఉందని సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ సెల్వపెరుంథాగై చెప్పారు. ఫోరంలోని అన్ని పక్షాల అభ్యర్థుల విజయం కోసం తమ పార్టీ అధినేతలు రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీ ప్రచారం చేస్తారని ఆయన తెలిపారు. కాగా 2019లోనూ కాంగ్రెస్‌కు 10 స్థానాలు కేటాయించగా.. నాటి టిఎన్‌సిసి అధ్యక్షులు ఇవికెఎస్‌ ఎలన్‌గోవన్‌ పోటీ చేసిన థెని నియోజకవర్గం మినహా అన్ని స్థానాల్లోనూ విజయం సాధించింది. ఇండియా ఫోరంలో కీలకమైన సిపిఎం, సిపిఐకి రెండేసి స్థానాలు చొప్పున కేటాయించారు. అలాగే ఎండిఎంకె పార్టీకి ఒక స్థానం, రెండు రిజర్వుస్థానాలైన విల్లుపురం, చిదంబరం నియోజకవర్గాలను విసికె పార్టీకి కేటాయించారు. రామనాథపురం స్థానాన్ని ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ (ఐయుఎంఎల్‌)కు, నమక్కల్‌ స్థానాన్ని కొంగునాడు మక్కళ్‌ దేశియ కట్చి (కెఎండికె)కు కేటాయించారు. ప్రఖ్యాత నటుడు, మక్కల్‌ నీథి మయం (ఎంఎన్‌ఎం) అధినేత కమల హాసన్‌ ‘ఇండియా’ ఫోరానికి మద్దతు ప్రకటించారు. ఈ దఫా లోక్‌సభ ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదని ముఖ్యమంత్రి స్టాలిన్‌తో భేటీ అనంతరం కమల్‌ ప్రకటించారు. ‘నేను పోటీ చేయడం లేదు. డిఎంకె నేతృత్వంలోని ఫోరానికి సంపూర్ణ మద్దతు ఉంటుంది. ఇది పదవులకు సంబంధించిన అంశం కాదు.. దేశానికి సంబంధించిన అంశం’ అని ఆయన అన్నారు. కాగా ఎంఎన్‌ఎంకు ఒక రాజ్యసభ సీటు కేటాయించేందుకు ఒప్పందం కుదిరినట్లు తెలిసింది.

➡️