‘సుప్రీం’కు మహువా మొయిత్రా

Dec 11,2023 14:31 #Supreme Court

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : లోక్‌సభ నుంచి తనను బహిష్కరించడాన్ని సవాల్‌ చేస్తూ టిఎంసి నాయకులు మహువా మొయిత్రా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎథిక్స్‌ కమిటీ సభ్యుల ప్రవర్తనకు సంబంధించిన విషయాలను పరిశీలించడానికి మాత్రమే అధికారం కలిగివుంటుందని, సభ్యత్వాన్ని పూర్తిగా రద్దు చేయాలని సిఫారసు చేసే అధికారం ఆ కమిటీకి లేదనేది మహువా మొయిత్రా వాదన. లోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్‌ హీరానందని నుంచి డబ్బులు తీసుకున్నట్లు ఆమెపై ఆరోపణలు వచ్చాయి. క్యాష్‌ ఫర్‌ క్వయిరీకి (ప్రశ్నల కోసం డబ్బులు పుచ్చుకోవడం) వచ్చిన ఆరోపణలపై విచారించిన ఎథిక్స్‌ కమిటీ ఎలాంటి నిర్దిష్టమైన ఆధారాల్లేకుండా, సరైన దర్యాప్తు చేయకుండా లోక్‌సభ నుంచి తనను తొలగించాలని సిఫారసు చేసిందని మహువా సోమవారం దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. వ్యాపారి దర్శన్‌ హీరానందానీ ఆదేశాలతో అదానీ కంపెనీలకు సంబంధించి పార్లమెంటులో మొయిత్రా పలు ప్రశ్నలు అడిగారని, ఆమె తన లోక్‌సభ లాగిన్‌ ఆధారాలను హీరానందానీతో పంచుకున్నారని బిజెపి ఎంపి నిషికాంత్‌ దూబే చేసిన ఫిర్యాదుపై లోక్‌సభ స్పీకరు ఎథిక్స్‌ కమిటీ వేసిన సంగతి తెలిసిందే. అదానీ అక్రమాలకు సంబంధించి పలు ప్రశ్నలను సంధిస్తున్న నేపథ్యంలో మోడీ ప్రభుత్వం కక్షకట్టి ఆమె లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేశాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

➡️