బరిలో 1,351 మంది

– మూడో దశలో అభ్యర్థుల పోటీపై ఇసి సమాచారం
– 12 రాష్ట్రాలు, యుటిలలో 95 స్థానాలకు ఎన్నికలు
న్యూఢిల్లీ : వచ్చే నెల 7న జరగబోయే మూడో దశ లోక్‌సభ ఎన్నికల్లో 1,351 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని ఎన్నికల సంఘం (ఇసి) వెల్లడించింది. ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేసింది. ”12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు (యుటి) నుంచి 1,351 మంది అభ్యర్థులు లోక్‌సభ ఎన్నికల మూడో దశ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. మధ్యప్రదేశ్‌లోని బేతుల్‌ పార్లమెంటరీ నియోజకవర్గం (పిసి)లో వాయిదా పడిన ఎన్నికలకు పోటీ చేస్తున్న ఎనిమిది మంది అభ్యర్థులు ఇందులో ఉన్నారు. గుజరాత్‌లోని సూరత్‌ స్థానం నుంచి ఒక అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు” అని ఇసి వివరించింది. మూడో దశలో లోక్‌సభ ఎన్నికలకు వెళ్లే 12 రాష్ట్రాలు, యూటీలలోని 95 నియోజకవర్గాలకు (బెతుల్‌తో సహా) మొత్తం 2,963 నామినేషన్లు దాఖలయ్యాయని ఇసి పేర్కొంది. దాఖలైన అన్ని నామినేషన్ల పరిశీలన అనంతరం 1563 నామినేషన్లు చెల్లుబాటు అయినట్టు వివరించింది. మూడో దశలో గుజరాత్‌లో 26 లోక్‌సభ స్థానాల నుంచి గరిష్టంగా 658 నామినేషన్లు అందాయనీ, మహారాష్ట్రలో 11స్థానాల నుంచి 519 నామినేషన్లు వచ్చాయని ఇసి తెలిపింది.
మూడో దశలో మే 7న బేతుల్‌ సీటుతో పాటు 94 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరగనున్నది. అసోం, బీహార్‌, ఛత్తీస్‌గఢ్‌, దాద్రా-నగర్‌ హవేలీ, డామన్‌-డయ్యూ, గోవా, గుజరాత్‌, జమ్మూకాశ్మీర్‌, కర్నాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఉత్తర ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలులో ఈ ఎన్నికలు జరగనున్నాయి.

➡️