West Bengal : టిఎంసి నేత మద్దతుదారులు ఈడీ అధికారులపై దాడి

న్యూఢిల్లీ : పశ్చిమబెంగాల్‌లో టిఎంసి నేత షాజహాన్‌ మద్దతుదారులు ఈడీ అధికారులపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో ఇడి అధికారులు తీవ్రంగా గాయాలపాలయ్యారు. ఈ ఘటనపై బిజెపి మండిపడింది. ఈ దాడిని ఆ రాష్ట్ర గవర్నర్‌ సివి ఆనంద బోస్‌ ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి విధ్వంసాలను అరికట్టడం ప్రభుత్వ విధి. ప్రభుత్వం తన ప్రాథమిక విధిలో విఫలమైతే.. భారత రాజ్యాంగం తన పని తాను చేస్తోంది.’ అని ఆయన అన్నారు.

కాగా, శుక్రవారం రేషన్‌ పంపిణీ కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు శుక్రవారం పశ్చిమబెంగాల్‌లోని నార్త్‌ 24 పరగణాస్‌ జిల్లాలోని సందేశ్‌ఖలిలో టిఎంసి నేత షేక్‌ షాజహాన్‌ ఇంట్లో సోదాలు జరుపుతున్నారు. సోదాలు జరిగే సమయంలో షాజహాన్‌ మద్దతుదారులు ఈడీ అధికార బృందంపై దాడి చేశారు. అధికారుల మొబైల్‌ ఫోన్‌లు, పర్సులు, ల్యాప్‌టాప్‌లతో సహా వారి వస్తువులను ధ్వంసం చేశారు. ఈ దాడిలో ఇద్దరు అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. వారు ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్నారు. ఈ ఘటనపై ఇడి స్పందించింది. ‘షాజహాన్‌ అనుచరులు దాదాపు 800-1000 మంది ఇడి అధికారులపై దాడికి పాల్పడ్డారు. వారంతా.. లాఠీలు, రాళ్లు, ఇటుకలు, ఆయుధాలతో అధికారులను చంపేందుకు ప్రయత్నించారు’ అని ఇడి ఏజెన్సీ తెలిపింది.

ఈ ఘటనను బిజెపి కుట్రగా తృణమూల్‌ కాంగ్రెస్‌ అభివర్ణించింది. కేంద్ర ఏజెన్సీ సంస్థల వికృత చేష్టలు స్థానికుల్ని రెచ్చగొట్టాయి అని టిఎంపి పేర్కొంది. రాష్ట్రంలోని అధికార పార్టీపై కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వ అధికారం కొనసాగడం దేశ భద్రతకు ముప్పు అని టిఎంపి పేర్కొంది. తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకుడు శశిపంజా మాట్లాడుతూ.. ‘ఈ ప్రాంతంలో స్థానికులను రెచ్చగొట్టారు. ఫలితంగా వారు దాడి చేశారు. మేము హింసకు మద్దతు ఇవ్వము. అయితే కొంతమంది ఉద్దేశపూర్వకంగానే బెంగాల్‌ పరువు తీసేలా ప్రయత్నిస్తున్నారు.’ అని ఆయన అన్నారు. ఇక ఈ ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీని బిజెపి నేత సువేందు అధికారి విమర్శించారు. ఆమె ప్రోత్సాహం వల్లే రేషన్‌ కుంభకోణం జరిగిందనిసువేందు అధికారి సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు.

➡️