ఏటీఎం సెంటర్లలో కొత్తరకం మోసం..

May 2,2024 13:20 #Business

ఢిల్లీ : ఏటీఎంల నుంచి నగదు విత్‌ డ్రా చేసేవాళ్లను బోల్తా కొట్టించేందుకు నేరస్థులు కొత్త కొత్త పద్ధతులను వాడుతున్నారని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. సెక్యూరిటీ గార్డులేని ఏటీఎం సెంటర్‌ ను ఎంచుకుని నేరస్థులు ఈ కొత్తరకం మోసానికి పాల్పడుతున్నారని పోలీసులు చెప్పారు. తమ మోసం రికార్డు కాకుండా ఏటీఎం సెంటర్‌ లోని సీసీటీవీ కెమెరాలపై రంగును స్ప్రే చేస్తారు. ఆపై ఏటీఎం మెషిన్‌ లోని కార్డ్‌ రీడర్‌ ను తొలగిస్తారు. ఆపై నగదు విత్‌ డ్రా చేసేందుకు వచ్చే వాళ్ల కోసం చుట్టుపక్కల కాలక్షేపం చేస్తుంటారు. ఏటీఎం సెంటర్‌ లోకి కస్టమర్‌ అడుగుపెట్టగానే తాము కూడా నగదు విత్‌ డ్రా చేసుకోవడానికి వచ్చినట్లు అక్కడికి చేరుకుంటారు. మెషిన్‌ లో ఇరుక్కున్న కార్డును తీయడానికి సాయం చేస్తామంటూ ముందుకొచ్చి, ఏటీఎం పిన్‌ ఎంటర్‌ చేసి చూడాలని సలహా ఇస్తారు. కస్టమర్‌ ఎంటర్‌ చేసిన పిన్‌ నెంబర్‌ గుర్తుంచుకుంటారు. ఎంత ప్రయత్నించినా కార్డు రాకపోవడంతో బ్యాంకును సంప్రదించాలని సూచించి అక్కడి నుంచి వెళ్లిపోతారు. చేసేదేంలేక కస్టమర్‌ వెళ్లిపోగానే తిరిగి వచ్చి కార్డును తీసుకుని వేరే ఏటీఎంకు వెళ్లి నగదు డ్రా చేసుకుంటారు. ఏటీఎం సెంటర్‌ చుట్టుపక్కల జన సంచారం లేని చోట ఇలాంటి మోసాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి అలాంటి చోట నగదు విత్‌ డ్రా చేసే ప్రయత్నం కూడదని పోలీసులు సూచించారు. రాత్రిపూట మరింత జాగ్రత్తగా ఉండాలని, వెలుతురు బాగా ఉన్న ఏటీఎంలలోనే నగదు విత్‌ డ్రా చేసుకోవాలని చెప్పారు.

➡️