ఢిల్లీ సంక్షేమ మంత్రి రాజీనామా

Apr 10,2024 17:13 #AAP minister.., #Arvind Kejriwal, #Quit

న్యూఢిల్లీ : ఢిల్లీ సంక్షేమశాఖ మంత్రి రాజ్‌కుమార్‌ ఆనంద్‌ బుధవారం తన పదవికీ రాజీనామా చేశారు. కేబినెట్‌, పార్టీ పదవులను వదులుకున్నారు. రాజీనామా సందర్భంగా ఆప్‌పై అవినీతి ఆరోపణలు చేశారు. ‘ప్రజలకు సేవ చేసేందుకు, అవినీతిపై పోరాడాలన్న బలమైన సంకల్పాన్ని చూసి ఆప్‌లో చేరాను. కానీ ఈరోజు ఆ పార్టీనే అవినీతికి అడ్డాగా మారిపోయింది. అందుకే దీనిని వీడాలని నిర్ణయించుకున్నాను” అని రాజ్‌కుమార్‌ తెలిపారు. అలాగే ఆప్‌లో నాయకత్వ పదవులకు నియామకాల విషయంలో వివక్ష ఉందని ఆరోపించారు. రాజ్‌కుమార్‌ పటేల్‌ నగర్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కేజ్రీవాల్‌ అరెస్టు తర్వాత ఒక మంత్రి రాజీనామా చేయడం ఇదే తొలిసారి.

బిజెపి భయంతోనే.. : ఆప్‌
మంత్రి రాజ్‌ కుమార్‌ ఆనంద్‌ తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడంపై ఆప్‌ నాయకులు స్పందించారు. బిజెపి బెదిరింపులు, ఒత్తిడి కారణంగానే రాజ్‌కుమార్‌ రాజీనామా చేసి ఉండొచ్చనని ఆప్‌ నాయకులు, ఢిల్లీ మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌ తెలిపారు. అలాగే, ‘రాజీనామ చేసినందుకు రాజ్‌కుమార్‌పై నిందలు వేస్తామని, ద్రోహి అని పిలుస్తామని చాలా మంది అనుకుంటారు. కానీ మేం అలాచేయం. ఎందుకంటే అతను భయపడి ఉండాడని మేం భావిస్తున్నాం. అతనీకి కుటుంబం, పిల్లలు, బంధువులు ఉన్నారు’ అని భరద్వాజ్‌ అన్నారు. ‘ఒక దళిత ఎమ్మెల్యేనే ఈ విధంగా బెదిరిస్తే సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి’ అని తెలిపారు. అలాగే, కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన ఉద్దేశమే ఇది అని రాజ్యసభ ఎంపీ సంజరు సింగ్‌ విమర్శించారు. కేజ్రీవాల్‌ను అరెస్టు చేసి ఆప్‌ను అంతం చేయాలని బిజెపి కోరుకుటుందని చెప్పారు. బిజెపి ఇడి, సిబిఐని ప్రయోగించి తమ మంత్రులను, ఎమ్మెల్యేలను చీల్చుతోందని.. ఇది తమందరికీ ఒక అగ్ని పరీక్షలాంటిదన్నారు.

➡️