ప్రధాని మోడీపై చర్యలు తీసుకోవాలి

Apr 22,2024 21:43 #Congress, #Jairam Ramesh
  •  కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్‌

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన ప్రధాని మోడీ, బిజెపి నేతలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్‌ కోరారు. కాంగ్రెస్‌ నేతలు అభిషేక్‌ మను సింఘ్వీ, గుర్దీప్‌ సప్పల్‌, సుప్రియా శ్రీనాట్‌లతో కూడిన కాంగ్రెస్‌ ప్రతినిధి బృందం సోమవారం కేంద్ర ఎన్నికల సంఘంతో సమావేశమైంది. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951, సుప్రీంకోర్టు వివిధ తీర్పులు, ఎన్నికల కమిషన్‌ మోడల్‌ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు బిజెపి, ఇతర నేతలపై 16 ఫిర్యాదులను సమర్పించారు. ‘ఈ చాలా చట్టబద్ధమైన ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకుంటారని మేము ఆశిస్తున్నాము’ అని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్‌ ఎక్స్‌లో ఒక పోస్టు చేశారు. ముస్లిం సమాజానికి సంపదను పునఃపంపిణీ చేయడం గురించి ప్రధాని చెప్పినట్లు కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ఉంటే చూపించాలని మోడీని కాంగ్రెస్‌ నిలదీసింది. కాంగ్రెస్‌ అధ్యక్షులు మల్లికార్జున్‌ ఖర్గే ఎక్స్‌లో ఇండియా బ్లాక్‌ మొదటి రౌండ్‌లో గెలిచిందని గ్రహించిన తరువాత ప్రధాని ‘ద్వేషపూరిత ప్రసంగం’ చేశారని పేర్కొన్నారు. అధికారం కోసం అబద్ధాలు చెప్పడం, ప్రత్యర్థులపై నిరాధార ఆరోపణలు చేయడం రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు – బిజెపి సమ్మేళనం విలువలను మోడీ గ్రహించారని ఖర్గే ఆరోపించారు.

ఆయనది విషం చిమ్మే భాష : రాహుల్‌
సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికే మోడీ కొత్త ఎత్తుగడలు అవలంబిస్తున్నారని, ఆయనది విషం చిమ్మే భాష అని రాహుల్‌గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి ప్రధాన సమస్యలను ఎదుర్కొంటుంటే మోడీ మాత్రం అంతా బాగానే ఉన్నదని చెబుతున్నారని సోమవారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో రాహుల్‌ ఎద్దేవా చేశారు.

➡️