రెండేళ్లలో 4.25 లక్షల మంది ఐటి ఉద్యోగులపై వేటు

ai impact on job layoffs

న్యూఢిల్లీ : ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) పుణ్యమా అని ఐటీ కంపెనీలు వేలాది మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నాయి. గత రెండు సంవత్సరాల కాలంలో ఐటీ కంపెనీలు 4.25 లక్షల మందిని ఉద్యోగాల నుండి తొలగించాయని లేఆఫ్‌-ఫ్లై అనే వెబ్‌సైట్‌ తెలిపింది. ఐటీ రంగంలో ఉద్యోగాల పరిస్థితిపై ఈ వెబ్‌సైట్‌ ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ ఉంటుంది. 2021, 2022 సంవత్సరాలలో తలెత్తిన కోవిడ్‌, అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం వంటి ప్రతికూల పరిస్థితులలో కూడా ఐటీ కంపెనీలు ఉద్యోగులను ఇంత పెద్ద సంఖ్యలో తొలగించలేదు. ముఖ్యంగా హాలిడే సీజన్‌లో ఉద్యోగాలు కోల్పోతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. తాజాగా ఇంటెల్‌ కంపెనీ అమెరికాలోని తన హార్డ్‌వేర్‌ విభాగంలో 300 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. లాస్‌ ఏంజెల్స్‌లో ఎలన్‌ మస్క్‌ చేపట్టిన హైపర్‌లూప్‌ వన్‌ ప్రాజెక్ట్‌ అనుకున్న విధంగా ప్రారంభం కాలేదు. దీంతో ఈ కంపెనీ గత వారం తన కార్యకలపాలన్నింటినీ నిలిపివేసింది. ఫలితంగా అందులో పనిచేస్తున్న ఉద్యోగులందరూ రోడ్డున పడ్డారు. తాజాగా మన దేశంలో కూడా 36 వేల మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు. ఈ ఏడాది తొలి మూడు త్రైమాసికాలలో దేశంలో 28 వేల మంది ఐటీ నిపుణులను ఉద్యోగాల నుండి తొలగించారని లాంగ్‌హౌస్‌ కన్సల్టింగ్‌ సంస్థ తెలిపింది. ఉద్యోగుల తొలగింపునకు అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులే కారణమని ఐటీ కంపెనీలు, స్టార్టప్‌ కంపెనీలు చెబుతున్నాయి. ఫిన్‌టెక్‌ కంపెనీలు, కన్స్యూమర్‌ టెక్‌ కంపెనీలు, రిటైల్‌ టెక్‌ కంపెనీలు ఈ ఏడాది ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించాయి. ఖర్చును తగ్గించుకొని, వ్యాపారాలను తిరిగి గాడిలో పెట్టే పేరుతో ‘పేటీఎం’ ఇటీవలే వెయ్యి మంది ఉద్యోగులపై వేటు వేసింది. ఆర్‌బీఐ విధించిన ఆంక్షల కారణంగా కొన్ని కార్యకలాపాల నుండి పేటీఎం వైదొలిగింది. ఫలితంగా ఉద్యోగులపై వేటు పడింది.

➡️