ఎయిర్‌ ఇండియాకు రూ.30 లక్షల జరిమానా

Feb 29,2024 15:37 #air india, #DGCA, #fine

న్యూఢిల్లీ :   ఎయిర్‌ ఇండియాకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డిజిసిఎ) రూ. 30 లక్షల జరిమానా విధించింది. 80 ఏళ్ల వఅద్ధుడు తన భార్యతో కలిసి ఎయిర్‌ ఇండియా విమానంలో న్యూయార్క్‌ నుండి ముంబయి చేరుకున్నాడు. విమానం ఛత్రపతి శివాజీ మహారాజ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌ అయిన అనంతరం విమానం నుండి టెర్మినల్‌ వరకు వీల్‌చైర్‌ ఏర్పాటు చేయకపోవడంతో నడుచుకుంటూ వెళ్లాలని నిర్ణయించాడు. అయితే కొంత దూరం నడిచిన అనంతరం ఆ వృద్ధుడు తీవ్ర అస్వస్థతకు గురై మరణించాడు. ఈ ఘటన ఈ నెల 16వ తేదీన జరిగింది. ఈ ఘటనపై డిజిసిఎ తీవ్రంగా స్పందించింది. ఏడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఎయిర్‌ ఇండియాకు షోకాజ్‌ నోటీసు జారీ చేసింది.

ఈ ఘటనపై ఎయిర్‌ ఇండియా వివరణనిస్తూ.. ఆ వృద్ధుని భార్యకు వీల్‌ చైర్‌ ఏర్పాటు చేశామని, మరొకటి ఏర్పాటు చేసే వరకు వేచి ఉండాలని సిబ్బంది కోరారని పేర్కొంది. అయితే ఆ వృద్ధుడు నడిచివెళ్లాలని నిర్ణయించుకున్నారని తెలిపింది.

ఎయిరిండియా సంబంధిత నిబంధనలు ఉల్లంఘించిందని, రూ. 30 లక్షలు జరిమానా విధిస్తున్నట్లు డిజిసిఎ ప్రకటించింది. ప్రయాణికులకు వీల్‌చైర్‌ సమకూర్చడంపై విధి విధానాలు తప్పక పాటించాలని అన్ని విమానయాన సంస్థలకు సూచనలు జారీ చేసింది.

➡️