ఎన్నికల కమిషనర్ల బిల్లుకు సవరణలు చేయండి

Dec 6,2023 10:54 #Election Commission
  • ఎంపీలకు విద్యావేత్తల బహిరంగ లేఖ

న్యూఢిల్లీ : ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాలలో చర్చకు వచ్చే అవకాశమున్న ఎన్నికల కమిషనర్ల బిల్లులో సవరణలు చేయాలని పలువురు విద్యా వేత్తలు, ప్రభుత్వ మాజీ ఉన్నతోద్యోగులు, హక్కుల కార్యకర్తలు ఎంపీలను కోరారు. ఈ మేరకు ఓ బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల కమిషన్‌ రాజకీయాలకు అతీతంగా, స్వతంత్ర సంస్థగా వ్యవహరించేలా చూడాలని వారు డిమాండ్‌ చేశారు. మోడీ ప్రభుత్వం ప్రధాన ఎన్నికల కమిష నర్‌, ఇతర కమిషనర్ల బిల్లును పార్లమెంటులో తిరిగి ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ప్రతిపా దిత బిల్లు దేశ ప్రజాస్వామ్యాన్ని నీరుకారుస్తుందని, ఏకపార్టీ పాలనకు దారితీస్తుందని పేర్కొన్నారు. ఎన్నికల కమిషనర్‌ అనూప్‌ చంద్ర పాండే వచ్చే ఫిబ్రవరిలో పదవీవిరమణ చేయనున్న నేపథ్యంలో తమ అభ్యర్థనను అత్యవసరమైనదిగా పరిగణిం చాలని వారు కోరారు. ఈ బిల్లు ప్రస్తుత రూపంలోనే ఆమోదం పొందితే పాండే వారసుడి ఎంపిక ప్రక్రియలో పారదర్శకత లోపిస్తుందని, రాబోయే ఎన్నికల దృష్ట్యా ఎన్‌డిఎ ప్రభుత్వం తనకు ఇష్టమైన వ్యక్తిని ఆ పదవిలో కూర్చోబెట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్‌ను, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను, ఇతర కమిషనర్లను నియమించే ఎంపిక కమిటీకి ప్రధాని ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. ప్రతిపక్ష నేత, ప్రధాని నియమించే క్యాబినెట్‌ మంత్రి సభ్యుడిగా ఉంటారు. గతంలో ఈ కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తి సభ్యుడిగా ఉండేవారు. ఆయనను కమిటీ నుండి తప్పిస్తూ కేంద్రం బిల్లు తీసుకొచ్చింది. ‘ఎన్నికల కమిషన్‌ రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తూ ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహిం చాల్సి ఉంది. తాజా బిల్లులోని పలు నిబంధనలు ఈ విషయాన్ని విస్మరించాయి. కమిషన్‌ సమగ్రతను కాపాడాలంటే కొన్ని చట్టపరమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఎంపిక కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తిని చేర్చాలి. ఈసీ సభ్యుడికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి హోదా కల్పించాలి. సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించేందుకు అనుసరించే పద్ధతులనే ఎన్నికల కమిషనర్లకు వర్తింపజేయాలి. ఎంపిక కమిటీ ప్రొసీడింగ్స్‌ను పబ్లిక్‌ డొమైన్‌లో ఉంచాలి’ అని ఆ లేఖలో సూచించారు. బహిరంగ లేఖపై అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా (హైదరాబాద్‌) మాజీ ప్రిన్సిపాల్‌ ఇఎఎస్‌ శర్మ, ఐఐఎం అహ్మదాబాద్‌ మాజీ ప్రొఫెసర్‌ జగదీప్‌ ఎస్‌ ఛోకర్‌, మజ్దూర్‌ కిసాన్‌ శక్తి సంఘటన్‌ నేత అరుణా రారు, జెఎన్‌యు ప్రొఫెసర్‌ ఎమరిటస్‌ ప్రభాత్‌ పట్నాయక్‌, ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు ఎస్‌పి శుక్లా తదితరులు సంతకాలు చేశారు.

➡️