మీడియా సమావేశం ద్వారానే ఎన్నికల ప్రకటన

Feb 26,2024 10:51 #election commision

ఫేక్‌ పోల్‌ షెడ్యూల్‌పై ఎన్నికల సంఘం వివరణ

న్యూఢిల్లీ : రాబోయే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించినదిగా చెప్పబడుతున్న ఫేక్‌ షెడ్యూల్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారటంపై ఎన్నికల సంఘం (ఇసి) స్పందించింది. ఇందులో నిజం లేదని వెల్లడించింది. ఎన్నికల షెడ్యూల్‌ మీడియా సమావేశం ద్వారా ప్రకటిస్తామనీ, టెక్స్ట్‌, వాట్సాప్‌ మెసెజ్‌ల ద్వారా కాదని స్పష్టం చేసింది. లోక్‌సభకు ఏప్రిల్‌ 19న ఎన్నికలు జరుగనున్నాయంటూ ఓ ఫేక్‌ మెసేజ్‌ ప్రచారంలోకి రావటంతో పై విధంగా ఈసీ వివరణనిచ్చింది. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఒక ఫేక్‌ మెసేజ్‌ మార్చి 12న ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడుతుందనీ, నామినేషన్ల దాఖలుకు గడువు మార్చి 28 అనీ, పోలింగ్‌ తేదీ ఏప్రిల్‌ 19, ఫలితాలు మే 22న వెలువడతాయని వివరించింది. పోల్‌ బాడీకి చెందిన లెటర్‌హెడ్‌ కనిపించే ఈ నకిలీ సమాచారం వాట్సాప్‌ గ్రూపుల్లో హల్‌ చల్‌ చేసింది. దీంతో ఇది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సార్వత్రిక ఎన్నికలను ఒకే దశలో ఎలా నిర్వహిస్తారని పలు ప్రశ్నలు వెల్లడయ్యాయి. దీంతో ఎన్నికల సంఘం జోక్యం చేసుకొని ఫేక్‌ మెసేజ్‌పై స్పందించాల్సి వచ్చింది.

➡️