కర్నాటకలో మరో కీచక నేత – లైంగిక వేధింపుల కేసులో బిజెపి నాయకుడి అరెస్ట్‌

న్యూఢిల్లీ : లైంగిక వేధింపుల కేసులో జెడి(ఎస్‌) బహిష్కృత నేత, హసన్‌ సిట్టింగ్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ ఉదంతం ఇప్పటికే కర్నాటకను వణికిస్తున్నది. బిజెపి మిత్రపక్షమైన జెడి(ఎస్‌) నాయకుడి దారుణ చర్యలు బయటికి వచ్చిన కొన్ని రోజులకే.. బిజెపికి చెందిన నాయకుడు లైంగిక వేధింపుల కేసులో అరెస్టు కావటం గమనార్హం. న్యాయవాది కూడా అయిన జి దేవరాజే గౌడను లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి కర్నాటకలోని చిత్రదుర్గ జిల్లాలో శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. ప్రజ్వల్‌ రేవణ్ణ అనేక మంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు చూపుతున్న అనేక వీడియోలు తన వద్ద ఉన్నాయని గౌడ గతంలో చెప్పాడు. ప్రజ్వల్‌ రేవణ్ణను ఎన్నికల్లో పోటీకి దించకుండా పార్టీని హెచ్చరిస్తూ డిసెంబర్‌ 8న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బివై విజయేంద్రకు లేఖ రాసినట్టు కూడా సమాచారం. అయితే, ప్రజ్వల్‌ రేవణ్ణ స్వయంగా రికార్డ్‌ చేసిన వీడియోలు ఏప్రిల్‌ 26న వెలుగులోకి వచ్చిన తర్వాత, వాటిని కాంగ్రెస్‌ లీక్‌ చేసిందని గౌడ వివరించారు.
గతనెలలో హాసన్‌ జిల్లాలోని హౌలెనర్సిపూర్‌ పట్టణంలో గోవధపై ఒక మహిళ ఫిర్యాదు చేసింది. చట్టపరమైన విషయంలో తనకు సహాయం చేస్తానని హామీ ఇచ్చి, తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బాధిత మహిళ ఆరోపించింది. దీంతో పోలీసులు బిజెపి నేతకు నోటీసులు జారీ చేశారు. మహిళ ఫిర్యాదు మేరకు గౌడను శుక్రవారం అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. రాష్ట్రంలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హౌలెనర్సీపూర్‌ నుంచి బిజెపి గౌడను పోటీకి దింపింది. అయితే, ప్రజ్వల్‌ రేవణ్ణ తండ్రి, రాష్ట్ర మాజీ మంత్రి, జెడి(ఎస్‌) ఎమ్మెల్యే హెచ్‌.డి రేవణ్ణ చేతిలో ఆయన ఓడిపోయారు. కాగా, ప్రజ్వల్‌ రేవణ్ణపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణకు ఏప్రిల్‌ 27న కర్నాటకలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బఅందాన్ని ఏర్పాటు చేసిన విషయం విదితమే. ప్రస్తుతం ప్రజ్వల్‌ రేవణ్ణ జర్మనీలోని మ్యూనిచ్‌లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

➡️