15లోగా ఇద్దరు ఎన్నికల కమిషనర్ల నియామకం ?

న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘంలో కమిషనర్లుగా అనుప్‌ చంద్ర పాండే పదవీ విరమణ, అరుణ్‌ గోయెల్‌ ఆకస్మిక రాజీనామాతో ఏర్పడిన ఖాళీలను త్వరలోనే భర్తీ చేయనున్నట్టు తెలుస్తున్నది. ఈనెల 15 లోపు ఇద్దరు ఎన్నికల కమిషనర్లను నియమించే అవకాశం ఉన్నదని సమచారం. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను పోల్‌ ప్యానెల్‌ ప్రకటించే కొన్ని రోజుల ముందు.. గోయెల్‌ రాజీనామా చేశారు. ఈ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. మరొక ఇసి అనుప్‌ చంద్ర పాండే ఫిబ్రవరి 14న 65 ఏండ్ల వయసులో పదవీ విరమణ చేశారు. దీంతో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సిఇసి) రాజీవ్‌ కుమార్‌ పోల్‌ అథారిటీలో ఏకైక సభ్యుడిగా ఉన్నారు. మార్చి 13 లేదా 14 తేదీల్లో సెలక్షన్‌ కమిటీ సమావేశం కావచ్చనీ, మార్చి 15లోగా నియామకాలు జరిగే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. ఇటీవలే సీఈసీ, ఈసీల నియామకంపై కొత్త చట్టం అమల్లోకి రాకముందే, ఎన్నికల కమిషనర్లను ప్రభుత్వ సిఫారసు మేరకు రాష్ట్రపతి నియమించిన విషయం విదితమే.

➡️