బిజెపిలో చేరకుంటే అరెస్టులేనట ! – మీడియాతో మంత్రి అతిషి

Apr 3,2024 07:53 #AAP, #Atishi, #Delhi

– ఆప్‌ ఎంపి సంజయ్ సింగ్‌కు బెయిలు
ప్రజాశక్తి  న్యూఢిల్లీ బ్యూరో :బిజెపిలో చేరకుంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) వేధింపులు తప్పవని, అరెస్టులు కూడా ఉంటాయని ఆ పార్టీ నేతలు తమను బెదిరించినట్లు ఆమాద్మీ పార్టీ నేత, ఢిల్లీ మంత్రి అతిషీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆమాద్మీ పార్టీ నేతలను బిజెపి లక్ష్యంగా చేసుకుందని పేర్కొన్నారు. తనతో పాటు ఆప్‌ నేతలు సౌరభ్‌ భరద్వాజ్‌, దుర్గేష్‌ పాఠక్‌, రాఘవ్‌ చద్దాలను అరెస్టు చేసే అవకాశం ఉందని తెలిపారు. తమ నివాసాల్లో త్వరలోనే ఇడి దాడులు జరుగుతాయని, అనంతరం తమను అదుపులోకి తీసుకుంటారని చెప్పారు.
”అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్ట్‌ తరువాత ఆప్‌ పడిపోతుందని బిజెపి ఊహించింది. కానీ రాంలీలా మైదాన్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రతిపక్ష పార్టీలు ఒక్కటవడాన్ని చూసి వారు బెంబేలెత్తుతున్నారు. త్వరలోనే మాకు సమన్లు? జారీ చేస్తారు. ఆపై జైల్లో పెడతారు. అయినా మేము ఇటువంటి వాటికి బెదిరేది లేదు. మా చివరి శ్వాస వరకు కేజ్రీవాల్‌తోనే ఉంటాం. కలిసి పోరాడతాం. అందరినీ జైలులో పెట్టనివ్వండి. అక్కడి నుంచే మా ఉద్యమాన్ని కొనసాగిస్తాం” అని అతిషీ అన్నారు.
ఆప్‌ ఎంపి సంజరు సింగ్‌కు బెయిల్‌
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఆప్‌ నేత, ఎంపి సంజరు సింగ్‌కు ఆరు నెలల తరువాత బెయిలు మంజూరైంది. ఇదే కేసులో ఆప్‌ కన్వీనర్‌, ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తీహార్‌ జైలుకు తరలించిన 24 గంటల్లోనే ఈ పరిణామం చోటు చేసుకుంది ఆయనను ఇక కస్టడీలో ఉంచాల్సిన అవసరం లేదని ఇడి చెప్పడంతో జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్త, జస్టిస్‌ ప్రసన్న బి వరలేలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఆయనకు బెయిలు మంజూరు చేసింది. అయితే ట్రయల్‌ కోర్టు ఇచ్చిన షరతులు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది. ఈ కేసులో గతేడాది అక్టోబర్‌ 4న ఎంపి సంజరు సింగ్‌ను ఇడి అరెస్ట్‌ చేసింది. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా, ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌, బిఆర్‌ఎస్‌ సేత కవిత తీహార్‌ జైలులో ఉన్నారు.
ఇడి ప్రతీకార చర్య : సింఘ్వీ
లిక్కర్‌ స్కాంలో సంజరు సింగ్‌ పై ఇడి చేస్తోన్న ఆరోపణలు మొత్తం అప్రూవర్‌ గా మారిన దినేశ్‌ అరోరా స్టేట్మెంట్‌ తో ముడిపడి ఉన్నాయని సింఘ్వీ కోర్టు కు నివేదించారు. అరోరా ముందు ఇచ్చిన 9 వాంగ్మూలాలలో సంజరు సింగ్‌ పేరు లేదని, తరువాత ఆయన పేరు చేర్చినట్లు చెప్పారు. అనంతరం ఇడి ‘నో అబ్జక్షన్‌’ స్టేట్మెంట్‌ తో అప్రూవర్‌ గా మారిన దినేశ్‌ అరోరాకు బెయిల్‌ వచ్చిందని అన్నారు.. అయితే సెక్షన్‌ 50 ప్రకారం అరోరా స్టేట్మెంట్‌ పై తమకు అభ్యంతరం లేదన్నారు. కానీ సంజరు సింగ్‌ అరెస్ట్‌ జరిగిన రోజు నిర్వహించిన ప్రెస్‌ మీట్‌ తరువాత, ఇడి ప్రతీకార చర్యలు చేపట్టిందని ఆరోపించారు. ఈ వాదనలు విన్న ధర్మాసనం, సంజరు సింగ్‌ నుంచి ఎలాంటి డబ్బు రికవరీ కానందున తదుపరి కస్టడీ అవసరమా? లేదా అనే అంశంపై స్పష్టత ఇవ్వాలని ఎఎస్జి ఎస్వీ రాజునుకోరింది. ఇడి నుంచి అభ్యంతరం లేకపోవడంతో బెయిలు మంజూరు చేసింది.
ఈరోజు కోసం ఎదురుచూస్తున్నాం : సంజరు సింగ్‌ తల్లి రాధికా సింగ్‌
మద్యం పాలసీ కేసులో ఆప్‌ నేత సంజరు సింగ్‌కు బెయిల్‌ మంజూరు చేయడంపై ఆయన తల్లి రాధికా సింగ్‌ స్పందించారు. కోర్టు నిర్ణయంతో తాము సంతోషంగా ఉన్నామని, దీని కోసం తాము ఎప్పటినుంచో వేచి చూస్తున్నామని చెప్పారు. తన కుమారుడు అమాయకుడని, ఆయనను అరెస్ట్‌ చేయకూడదని, అయినా తనకు బెయిల్‌ రావడంతో తాము సంతోషంగా ఉన్నామని పేర్కొంది. ఇక సంజరు సింగ్‌కు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేయడాన్ని ఆప్‌ స్వాగతించింది. సత్యం గెలిచిందని ఆప్‌ జాతీయ ప్రతినిధి ప్రియాంక కక్కర్‌ పేర్కొన్నారు. తాము మొదటి నుంచి ఇదే చెబుతున్నామని, ఈ కేసు మొత్తం బూటకమని, బిజెపి కార్యాలయంలో ఈ కేసుపై కట్టుకథ అల్లారని ఆమె విమర్శించారు. మరో 500 సార్లు దాడులు చేసినా ఒక్క పైసా కూడా స్వాధీనం చేసుకోలేరని అన్నారు. విచారణలో డబ్బు దొరకనప్పుడు ఆయనను ఎందుకు కస్టడీలో ఉంచాలని సుప్రీంకోర్టుప్రశ్నించిందని కూడా ప్రియాంక కక్కర్‌ పేర్కొన్నారు.

➡️