మరో నౌక హైజాక్‌కు యత్నం

Jan 6,2024 10:43 #attempt, #Hijacked ship, #Navy Depo
  • తక్షణమే స్పందించిన భారత నేవీ
  • 15 మంది భారతీయులతో సహా 21మంది సిబ్బంది సురక్షితం

న్యూఢిల్లీ : అరేబియా సముద్రంలో లైబీరియన్‌ జెండాతో కూడిన ఓడను హైజాక్‌ చేసేందుకు ప్రయత్నం జరిగిందన్న సమాచారం అందగానే భారత నావికాదళం సత్వరమే స్పందించింది. 15మంది భారతీయులతో సహా 21మంది సిబ్బందిని ఆ నౌక నుండి సురక్షితంగా కాపాడింది. ఈ మేరకు శుక్రవారం భారత నావికాదళం ఒక ప్రకటన జారీ చేసింది. హైజాక్‌ సమాచారం అందగానే ఐఎన్‌ఎస్‌ చెన్నైను దారి మళ్లించి ఆ ప్రాంతంలో మోహరించామని, సముద్ర జలాల గస్తీ విమానం శుక్రవారం ఉదయం ఆ నౌకలోని పరిస్థితులను పర్యవేక్షించిందని, నౌకలోని సిబ్బందితో కాంటాక్ట్‌ను ఏర్పరచుకుందని తెలిపింది. తర్వాత తమ మారిటైమ్‌ కమాండోలు ఆ నౌకను అడ్డగించి అందరినీ రక్షించారని తెలిపింది. ప్రస్తుతం సిబ్బంది అంతా సురక్షితంగానే వున్నారని పేర్కొంది. భారత నావికాదళం సమర్ధవంతంగా కలగచేసుకోవడంతో హైజాక్‌ యత్నాన్ని వారు విరమించారని నేవీ ప్రకటన తెలిపింది. తిరిగి లైబీరియన్‌ నౌకలో విద్యుత్‌ ఉత్పత్తిని పునరుద్ధరించి, ప్రయాణం సాగేలా ఐఎన్‌ఎస్‌ చెన్నై చర్యలు తీసుకుంటోందని ఆ ప్రకటన తెలిపింది. గురువారం సాయంత్రం గుర్తు తెలియని ఐదారుగురు సాయుధులు నౌకలోకి ఎక్కారంటూ లైబీరియన్‌ నౌక, యుకె మారిటైమ్‌ ట్రేడ్‌ ఆపరేషన్స్‌ పోర్టల్‌కు సందేశం పంపిందని భారత నేవీ అంతకుముందు ఒక ప్రకటనలో తెలిపింది. ఐఎఎన్‌ చెన్నై అవసరమైన సాయాన్ని అందించడానికి నౌకకు సమీపంగా వెళుతోందని తెలిపింది. మొత్తంగా పరిస్థితి అంతా బాగానే వుందని, ఇతర సంస్థలు, బహుళ జాతి బలగాల సమన్వయంతో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు నేవీ తెలిపింది. ఈ నౌకలో భారతీయ సిబ్బంది కూడా వున్నారు. ప్రస్తుతం వీరందరూ నౌకలోని స్ట్రాంగ్‌ రూమ్‌లో కూర్చుని వున్నారు. వారితో కమ్యూనికేషన్‌ వుందని చెప్పారు. ఈ ప్రాంతంలో ఇది రెండో హైజాకింగ్‌ సంఘటన. గత నెల్లో మాల్టా వెళుతున్న నౌకను కూడా సోమాలియా సముద్ర దొంగలు ఇలాగే హైజాక్‌ చేశారు. ఈ సంఘటనల నేపథ్యంలో భారత నావికాదళం సెంట్రల్‌, ఉత్తర అరేబియా సముద్ర జలాల్లో సముద్ర జలాల గస్తీని పెంచింది. బలగాల సంఖ్యను కూడా పెంచింది.

➡️