JKLF : యాసిన్‌ మాలిక్ సంస్థపై నిషేధం పొడిగించిన కేంద్రం

శ్రీనగర్‌ :    కాశ్మీర్‌ వేర్పాటువాద నేత యాసిన్‌ మాలిక్‌కు చెందిన జమ్మూ అండ్‌ కాశ్మీర్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ (జెకెఎల్‌ఎఫ్‌)పై నిషేధాన్ని కేంద్రం పొడిగించింది. జెకెఎల్‌ఎఫ్‌పై నిషేధాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా శనివారం ప్రకటించారు.

జెకెఎల్‌ఎఫ్‌ సంస్థ జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదం, వేర్పాటు వాదాన్ని ప్రోత్సహించే కార్యకలాపాలను కొనసాగిస్తోందని అమిత్‌షా ఎక్స్‌లో పేర్కొన్నారు. దేశ భద్రత, సార్వభౌమాధికారం, సమగ్రతను సవాలు చేస్తే చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు. ఉగ్రవాదంతో జమ్ముకాశ్మీర్‌లో విభజనను ప్రోత్సహించడంతో దేశ సమగ్రతను దెబ్బతీస్తోందని ఆరోపించారు.

జమ్ము అండ్‌ కాశ్మీర్‌ పీపుల్స్‌ లీగ్‌ (జెకెపిఎల్‌)కి చెందిన నాలుగు వర్గాలు జెకెపిఎల్‌ (ముక్తర్‌ అహ్మద్‌ వాజా), జెకెపిఎల్‌ (బషీర్‌ అహ్మద్‌ తోట), జెకెపిఎల్‌ (గులాం మొహమ్మద్‌ ఖాన్‌), జెకెపిల్‌ (అజీజ్‌ షేక్‌) లను చట్టవిరుద్ధమైన సంఘాలుగా కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఎ) పేర్కొంది.

ఉగ్రవాద నిరోధక చట్టం, చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం, 1967 (యుఎపిఎ) కింద 2019లో జెకెఎల్‌ఎఫ్‌ని ఎంహెచ్‌ఎ నిషేధించిన సంగతి తెలిసిందే. యుఎపిఎలోని సెక్షన్‌ 3 (1) కింద జమాతే – ఇస్లామీ (జెల్‌ -జెకె ) ని కేంద్రం నిషేధించిన కొన్ని రోజుల తర్వాత ఈ చర్య చేపట్టడం గమనార్హం.

➡️