ఇండోర్‌ మరో సూరత్‌గా మారడం వెనుక బిజెపి బ్లాక్‌మెయిలింగ్‌

  • 17ఏళ్ల నాటి కేసుకు తాజాగా హత్యాయత్నం అభియోగాన్ని జోడించింది

ఇండోర్‌ : ఇండోర్‌ మరో సూరత్‌గా మారడం వెనుక బిజెపి బ్లాక్‌మెయిలింగ్‌ రాజకీయాలు ప్రధాన భూమిక వహించాయని తాజాగా వెలుగులోకి వచ్చిన అంశాలు తెలియజేస్తున్నాయి. లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్‌ అభ్యర్ధిగా బరిలోకి దిగిన అక్షరు బామ్‌ సోమవారం పోటీ నుండి తప్పుకుని, ఆ వెంటనే బిజెపిలో చేరడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. అక్షరు బామ్‌ ఎదుర్కొంటున్న 17ఏళ్ళనాటి నాటి క్రిమినల్‌ కేసుపై ఇండోర్‌ జిల్లా కోర్టులో ఇప్పటివరకు 61 సార్లు విచారణ జరిగింది. .కేసు దాదాపు ముగింపుకొస్తున్న తరుణంలో బిజెపి ప్రభుత్వం కొత్తగా హత్యాయత్నం అభియోగాన్ని దానికి జోడించింది. ఇండోర్‌ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్‌ తరపున నామినేషన్‌ వేసిన రోజునే ఈ అభియోగాన్ని సెషన్స్‌ కోర్టు ఆ నేరాభియోగాన్ని జోడించింది. దీంతో ఆయన భయపడిపోయి బిజెపి బ్లాక్‌మెయిలింగ్‌ ఎత్తుగడలకు తలొగ్గినట్లు వరుసగా చోటుచేసుకున్న పరిణామాలు తెలియజేస్తున్నాయి.. కాంగ్రెస్‌ పార్టీ బేకప్‌ అభ్యర్ధిగా మోతీ సింగ్‌ వేసిన నామినేషన్‌ను సాంకేతిక కారణాలతో తిరస్కరించారు. అక్షరు కాంతిని ఉపసంహరించుకున్న నేపథ్యంలో సింగ్‌ తన నామినేషన్‌ను ఆమోదించాల్సిందిగా ఇండోర్‌ హైకోర్టుకు వెళ్ళారు. కానీ మంగళవారం ఆయన పిటిషన్‌ను తోసిపుచ్చారు. అక్షరు బామ్‌తోపాటు మరో8మంది అభ్యర్ధులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మే 13న ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి. బరిలో 13మంది మిగిలారు. బిజెపికి గట్టి పట్టు వున్న ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్ధులు పోటీలో లేకపోవడం ఇదే మొదటిసారి. అక్షరు కాంతిని బెదిరించి మరీ వారి పార్టిలోకి లాక్కున్నారని మధ్య ప్రదేశ్‌ కాంగ్రెస్‌ నేతలు విమర్శించారు. ఎంఎల్‌ఎలను కొనుగోలు చేయడానికి ముందుగా, వారిని బెదిరించి, నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేస్తున్నారని కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు జితూ పట్వారి విమర్శించారు. కాంతిపై ఒత్తిడి తెచ్చేందుకే ఏళ్ళ నాటి పాత కేసుసు నవరిస్తూ మార్పులు తీసుకువచ్చారన్నారు.

పాత కేసును తవ్వి…
2007 నాటి ఈ కేసులో బామ్‌ కుటుంబం తొలుత యూనస్‌ ఖాన్‌ అనే వ్యక్తి నుండి స్థలంకొనుగోలు చేసింది. ఆ తర్వాత బామ్‌పై ఫిర్యాదు చేస్తూ ఖాన్‌ పోలీసులను ఆశ్రయించాడు. దాంతో మేజిస్ట్రేట్‌ కోర్టు జారీ చేసిన ఆదేశాల ప్రకారం, పోలీసులు ఐపిసిలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గాయపరచడం, బహిరంగంగా అసభ్య పదజాలం ఉపయోగించడం, నేరపూరితమైన అడ్డ గింపు, అల్లర్లకు పాల్పడ్డం, చట్టవ్యతిరేకంగా సమావేశమ వడం, పేలుడు పదార్ధాలతో తప్పుడు పనులు వంటి అంశా లపై కేసు నమోదైంది. తాజాగా ఈ నెల 24న 307, 436 సెక్షన్లను చేర్చాల్సిందిగా కోర్టు పోలీసులను ఆదేశించింది. ఇది హత్యాయత్నానికి సంబంధించిన సెక్షన్‌ కావడంతో బెదిరిపోయిన బామ్‌ కాంగ్రెస్‌ను వీడి బిజెపిలో చేరారు.

➡️