గణతంత్ర వేడుకల్లో 16 శకటాలే ! 

Jan 12,2024 10:13 #BJP Govt, #Republic Day 2024
bjp govt discrimination in r day tableau
  • పలు రాష్ట్రాలకు లభించని ప్రాతినిధ్యం 
  • వివక్ష చూపారని కేంద్రంపై కర్ణాటక, పంజాబ్‌ ఆగ్రహం

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి ఈ ఏడాది 16 శకటాలకు మాత్రమే అవకాశం దక్కింది. కొన్ని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం కావాలనే శకటాల ప్రదర్శనకు అవకాశం కల్పించలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శకటాల ప్రదర్శన జాబితాలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు చోటు దక్కించుకున్నాయి. అయితే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (కాంగ్రెస్‌), పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ (ఆమ్‌ ఆద్మీ పార్టీ)తో సహా ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల శకటాలను తిరస్కరించడంపై విమర్శలు గుప్పించారు. వివక్ష తగదంటూ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు రిపబ్లిక్‌ డే పరేడ్‌లో శకటాల ప్రదర్శించడానికి సమాన అవకాశం ఇచ్చామని వివరణ ఇచ్చింది. రక్షణ మంత్రిత్వశాఖ, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం (ఎంఒయు) ప్రకారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కర్తవ్య పథ్‌లో రాబోయే మూడు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో తమ శకటాలను ప్రదర్శించడానికి సమాన అవకాశాన్ని పొందాయని ప్రభుత్వ సీనియర్‌ అధికారులు తెలిపారు. ఈ ఏడాది కర్తవ్య పథ్‌లో జరిగే రిపబ్లిక్‌ డే పరేడ్‌లో త్రివిధ రక్షణ శాఖలు, ఇతర యూనిఫాం దళాల కవాతులో 75 శాతం మంది మహిళలు పాల్గొంటారని అధికారులు తెలిపారు. జనవరి 26న రిపబ్లిక్‌ డే వేడుకల సందర్భంగా 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు శకటాలను ప్రదర్శించడానికి ఎంపిక చేశామన్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, హర్యానా, లడఖ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, ఝార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, తమిళనాడు, మహారాష్ట్ర, మణిపూర్‌, మేఘాలయ, ఒడిశా రాష్ట్రాలు ఈ సంవత్సరం తమ శకటాలను ప్రదర్శిస్తాయి. జమ్మూ కాశ్మీర్‌, కర్ణాటక, హిమాచల్‌ ప్రదేశ్‌, త్రిపుర, గోవా, అస్సాం, ఉత్తరాఖండ్‌ జనవరి 23 నుంచి 31 వరకు ఎర్రకోటలో భారత్‌ పర్వ్‌లో పాల్గొంటాయి. ఇందిరా గాంధీ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఆర్ట్స్‌ అండ్‌ ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ కల్చరల్‌ రిలేషన్స్‌ సిఫార్సు చేసిన ప్రఖ్యాత కళాకారులతో కూడిన నిపుణుల కమిటీని టాబ్లాక్స్‌ ఎంపిక కోసం ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. బహిరంగ ఎంపిక ప్రక్రియతో టేబుల్‌ యాక్స్‌ రూపకల్పన కోసం 30 ఏజెన్సీలు ఉన్నాయని, సైన్యంలో మహిళా సిబ్బంది తక్కువగానే ఉన్నప్పటికీ, గణతంత్ర దినోత్సవ కవాతులో 75 శాతం వరకు పాల్గొంటున్నారని తెలిపారు.

➡️