న్యూఢిల్లీ : ఎన్నికల బాండ్ల విక్రయాలు, బాండ్లను నగదు రూపంలోకి మార్చుకోవడానికి అనుసరించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌ఓపి), పద్ధతులను వెల్లడించడానికి ఎస్‌బిఐ తిరస్కరించింది. వాణిజ్యపరమైన రహస్యాల కిందకు ఈ సమాచారం వస్తుందంటూ దాన్ని బహిర్గతం చేయడానికి నిరాకరించిందని ఆర్‌టిఐ సమాచారం తెలియచేసింది. బాండ్లకు సంబంధించి ఎస్‌బిఐ అధికారిక శాఖలకు జారీ చేసిన ఆదేశాలు, పద్దతుల వివరాలను తెలియచేయాల్సిందిగా కోరుతూ సమాచార హక్కు చట్టం(ఆర్‌టిఐ) కార్యకర్త అంజలి భరద్వాజ్ దరఖాస్తు చేసుకోగా, సమాచారం ఇచ్చేందుకు ఎస్‌బిఐ నిరాకరించింది. 2018 నుండి ప్రతీసారీ బాండ్లకు సంబంధించి జారీ చేసిన ఆదేశాలన్నీ అంతర్గత ఆదేశాలని వాటిని కేవలం అంతర్గత పంపిణీ కోసమే ఉపయోగిస్తామని అంతేకానీ వాటిని వెల్లడించలేమని తెలిపింది. ఆర్‌టిఐ సెక్షన్ 8(1) (డి) కింద వాటికి మినహాయింపు వుంటుందని ఎస్‌బిఐ డిప్యూటీ జనరల్ మేనేజర్, సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారి కన్నబనాబు చెప్పారు. దీనిపై అంజలి భరద్వాజ్ స్పందిస్తూ, ఈ పథకమే రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ అన్ని వివరాలను వెల్లడించాలని సుప్రీం ఆదేశించినప్పటికీ ఇంకా కీలక సమాచారాన్ని ఇవ్వడానికి ఎస్‌బిఐ తిరస్కరించడం దిగ్భ్రాంతి కలిగిస్తోందని ఆమె వ్యాఖ్యానించారు.
