సిద్దూ మూసేవాలా తల్లిదండ్రులపై కేంద్రం ఫైర్‌

Mar 20,2024 17:46 #Punjab, #siddu

చండీగఢ్‌ : ప్రముఖ గాయకుడు సిద్దు మూసేవాలా 2022లో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. సిద్దు మృతితో మానసికంగా ఎంతో కుంగిపోయిన అతని తల్లిదండ్రులు మళ్లీ తల్లిదండ్రులు కావాలనుకున్నారు. తమకు పుట్టబోయే బిడ్డలో సిద్దూని చూసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలోనే సిద్దూ తల్లిదండ్రులు ఐవిఎఫ్‌ పద్ధతిలో మరోసారి తల్లిదండ్రులయ్యారు. సిద్దూ తండ్రి బల్కౌర్‌ సింగ్‌ తమకు ఒక బాబు పుట్టాడని, తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు. అయితే సిద్దూ తల్లి చరణ్‌సింగ్‌ (58) ఐవిఎఫ్‌ ద్వారా బిడ్డకు జన్మనివ్వడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఈ విషయంపై కేంద్రం వారిపై మండిపడింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ అసలు ఈ వయసులో పిల్లలను కనడం కరెక్టేనా అనే ప్రశ్నను లేవనెత్తింది. అసిస్టెడ్‌ రిప్రొడక్టివ్‌ టెక్నాలజీ (రెగ్యులేషన్‌) యాక్ట్‌, 2021లోని సెక్షన్‌ 21 ప్రకారం.. 21 నుంచి 50 ఏళ్లలోపు వయోపరిమితి ఉన్నవాళ్లే ఐవిఎఫ్‌ ద్వారా బిడ్డకు జన్మనివ్వడం సురక్షితం అని స్పష్టం చేసింది. అలాగే చరణ్‌సింగ్‌కి అందించిన ఐవిఎఫ్‌ చికిత్సకు సంబంధించిన నివేదిక ఇవ్వమని కేంద్రం పంజాబ్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో సిద్దు మూసేవాలే తండ్రిని శిశువుకు సంబంధించిన పత్రాలను సమర్పించాలని పంజాబ్‌ ప్రభుత్వం వారిని ఆదేశించింది.

కాగా, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లా అధికారులు తమను వేధిస్తున్నారని, చిన్నారికి సంబంధించి డాక్యుమెంట్స్‌ని సబ్మిట్‌ చేసినా అధికారులు తమను ఇబ్బంది పెడుతున్నారని సిద్దూ తండ్రి బల్కౌర్‌ సింగ్‌ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వీడియోలో తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి, అధికారులు జోక్యం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే లీగల్‌ డాక్యుమెంట్స్‌ని కచ్చితంగా సబ్మిట్‌ చేస్తానని, ఎప్పుడూ అధికారులకు అందుబాటులో ఉంటానని బల్కౌర్‌సింగ్‌ తెలిపారు.

➡️