సరిహద్దుల నుంచి బలగాల పూర్తి ఉపసంహరణ

ఇతర సమస్యలపైనా దృష్టి
భారత్‌, చైనా వర్కింగ్‌ గ్రూప్‌ సమావేశంలో అంగీకారం
న్యూఢిల్లీ : వాస్తవాధీన రేఖ (ఎల్‌ఎసి) వద్ద భద్రతా బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోవడం, ఇతర అంశాలను పరిష్కరించుకోవడంపై ప్రస్తుతం భారత్‌, చైనా దృష్టి సారించాయి. బుధవారం నాడు బీజింగ్‌లో జరిగిన ఈ రెండు దేశాల వర్కింగ్‌ గ్రూపు మెకానిజం 29వ సమావేశంలో ఈ మేరకు అంగీకారం కుదిరింది. కేంద్ర విదేశాంగ శాఖ గురువారం నాడిక్కడ ఈమేరకు ఒక ప్రకటన విడుదలజేస్తూ, భారత్‌ాచైనా సరిహద్దు ప్రాంతాల పశ్చిమ సెక్టార్‌లోని ఎస్‌ఎసి వెంబడి బలగాలను పూర్తిగా వెనక్కి తీసుకోవడం, మిగిలిన సమస్యలపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై ఇరు దేశాలు పరస్పరం అభిప్రాయాలు తెలియజేసుకున్నట్లు తెలియజేసింది. ఈ సమావేశంలో పాల్గన్న భారత బృందానికి కేంద్ర విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి (తూర్పు ఆసియా) నేతృత్వం వహించగా, చైనా బృందానికి ఆ దేశ విదేశాంగ శాఖకు చెందిన డైరక్టర్‌ జనరల్‌ (సరిహద్దు, సముద్రాల విభాగం) నాయకత్వం వహించారని ప్రకటన తెలిపింది. ‘రాబోయే కాలంలో, దౌత్య, సైనిక మార్గాల్లో క్రమం తప్పకుండా సంప్రదింపులు కొనసాగించడానికి, ఇప్పటికే కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందాలు, ప్రోటోకాల్‌లకు అనుగుణంగా సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, సామరస్యం కొనసాగించాల్సిన ఆవశ్యకతను ఇరు దేశాలు గుర్తించాయి’ అని ప్రకటన తెలిపింది. భారత్‌-చైనా సరిహద్దు వ్యవహారాలపై కన్సల్టేషన్‌ అండ్‌ కోఆర్డినేషన్‌ కోసం వర్కింగ్‌ మెకానిజం 28వ సమావేశం గతేడాది నవంబర్‌ 30న జరిగింది.

➡️