ప్రధాని మోడీపై ఇసికి కాంగ్రెస్‌ ఫిర్యాదు

న్యూఢిల్లీ :   ప్రధాని మోడీపై ఎన్నికల కమిషన్‌ (ఇసి)కి కాంగ్రెస్‌ సోమవారం ఫిర్యాదు చేసింది. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ విడుదల చేసిన మేనిఫెస్టో.. ముస్లింలీగ్‌ ముద్ర కనిపిస్తోందని, అబద్ధాల పుట్ట అంటూ ప్రధాని మోడీ శనివారం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

కాంగ్రెస్‌ మేనిఫెస్టోపై ప్రధాని వ్యాఖ్యలతో పాటు కేరళలోని తిరువనంతపురం నియోజకవర్గంలో పోటీ చేస్తున్న బిజెపి అభ్యర్థి రాజీవ్‌ చంద్రశేఖర్‌ ఎలక్షన్‌ అఫిడవిట్‌లపై ఎన్నికల కమిషన్‌కి ఫిర్యాదు చేశామని పవన్‌ ఖేరా పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే తీవ్రంగా స్పందించారు. ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపిలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. 1940లలో ముస్లిం లీగ్‌ సంకీర్ణంలో బెంగాల్‌, సింధ్‌, నార్త్‌ వెస్ట్‌ ఫ్రాంటియర్‌ ప్రావిన్స్‌ (ఎన్‌డబ్ల్యుఎఫ్‌పి)లలో శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ ప్రభుత్వాలను ఎలా ఏర్పాటు చేశారో అందరికీ తెలుసునని ఖర్గే విమర్శించారు. స్వాతంత్య్ర పోరాటంలో భారతీయులకు వ్యతిరేకంగా మోడీ-షా రాజకీయ, సైద్ధాంతిక గురువులు ముస్లిం లీగ్‌కు, బ్రిటీష్‌ వారికి మద్దతు ఇచ్చారని దుయ్యబట్టారు. 1942లో గాంధీ పిలుపునిచ్చిన మౌలానా ఆజాద్‌ నేతృత్వంలో క్విట్‌ ఇండియాను వారు వ్యతిరేకించారని అన్నారు. మోడీ ప్రసంగాల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ దుర్వాసన అధికమౌతుండటంతో .. బిజెపి ఎన్నికల గ్రాఫ్‌ రోజురోజుకీ పడిపోతుందని, ఆందుకే ఆర్‌ఎస్‌ఎస్‌ తన చిరకాల మిత్రుడు ముస్లిం లీగ్‌ను గుర్తు చేసుకుంటోందని ఎద్దేవా చేశారు.

➡️