43 మందితో కాంగ్రెస్‌ రెండో జాబితా

Mar 13,2024 08:33 #Congress, #Lok Sabha elections

ఐదు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి అభ్యర్థుల ప్రకటన
  పేదల కోసం లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పోటీ చేస్తుంది : కెసి వేణుగోపాల్‌
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచే 43 మంది అభ్యర్థులతో కాంగ్రెస్‌ రెండో జాబితా విడుదల చేసింది. ఇందులో అస్సోం (12), గుజరాత్‌ (7), మధ్యప్రదేశ్‌ (10), రాజస్థాన్‌ (10), ఉత్తరాఖండ్‌ (3), డమన్‌ అండ్‌ డయ్యూ (1) రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఈ జాబితాలో 10 జనరల్‌, 13 ఒబిసి, 10 ఎస్‌సి, 9 ఎస్‌టి, 1 మైనార్టీ అభ్యర్థికి అవకాశం కల్పించారు. మంగళవారం ఎఐసిసి ప్రధాన కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కెసి వేణుగోపాల్‌ రెండో జాబితాను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సోమవారం జరిగిన కాంగ్రెస్‌ సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ (సిఇసి)లో మహారాష్ట్ర, గుజరాత్‌, అస్సోం, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌కు సంబంధించిన రాష్ట్రాల అభ్యర్థుల ఎంపికపై చర్చించి నిర్ణయం చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీది ప్రజల అజెండా అన్నారు. పేదల కోసం కాంగ్రెస్‌ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తుందని వివరించారు. పేదలు, యువకులు, సామాజిక న్యాయం కోసం పోరాడుతుందన్నారు. కర్ణాటక, తెలంగాణలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామని వివరించారు. తాము అధికారంలోకి వస్తే పేద ప్రజల ప్రయోజనాల కోసం పని చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో వకులు, సామాజిక న్యాయం దిశగా కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రకటన ఉందన్నారు. ఇప్పటి వరకు విడుదల చేసిన రెండు జాబితాల్లో ఇదే సిద్ధాంతాన్ని అమలు చేశామని తెలిపారు.

రెండో జాబితాలో కీలక అభ్యర్థులు
రెండో జాబితాలో కాంగ్రెస్‌ పాలిత మాజీ ముఖ్యమంత్రుల కుమారులకు అవకాశం దక్కింది. మధ్యప్రదేశ్‌ మాజీ సిఎం కమల్‌నాథ్‌ కుమారుడు నకుల్‌ నాథ్‌ (సిట్టింగ్‌ ఎంపి) మరోసారి చిండ్వార నుంచి బరిలో నిలుస్తున్నారు. జలోర్‌ నుంచి రాజస్థాన్‌ మాజీ సిఎం అశోక్‌ గెహ్లాట్‌ కుమారుడు వైభవ్‌ గెహ్లాట్‌, జోర్హట్‌ నుంచి తరుణ్‌ గగోయి కుమారుడు గౌరవ్‌ గగోయి (సిట్టింగ్‌ ఎంపి)లకు మరోసారి అవకాశం కల్పించారు. ఇటీవల బిజెపి నుంచి కాంగ్రెస్‌లో చేరిన రామ్‌సింగ్‌ కాస్వాన్‌ కుమారుడు రాహుల్‌ కాస్వాన్‌ను రాజస్థాన్‌లోని చురు నుంచి పార్టీ బరిలో దింపింది. వీరితో పాటు పెద్ద సంఖ్యలో యువకులకు కాంగ్రెస్‌ అవకాశం కల్పించింది.

➡️