కాంగ్రెస్‌ సరిచేసుకోవాలి : కేరళ సిఎం విజయన్‌

Apr 2,2024 00:30 #Congress, #kerala, #Pinarayi Vijayan

కొజికోడ్‌ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్‌ ఎదుర్కొంటున్న పరిస్థితుల నుండి కాంగ్రెస్‌ గుణపాఠం నేర్చుకోవాల్సి వుందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఆదివారం ఇండియా బ్లాక్‌ ఏర్పాటు చేసిన ర్యాలీ బ్రహ్మాండంగా విజయవంతమైందని, ఇది బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎకు గట్టి హెచ్చరిక అని విజయన్‌ పేర్కొన్నారు. కాంగ్రెసేతర ప్రతిపక్ష పార్టీల నేతలపై బిజెపి ఉద్దేశపూరిత దాడుల పట్ల కాంగ్రెస్‌ వైఖరి సరైంది కాదని అన్నారు. ఢిల్లీ ప్రభుత్వంలో లిక్కర్‌ లైసెన్స్‌కి సంబంధించి అవినీతి జరిగిందంటూ మొదటగా పోలీసు ఫిర్యాదు చేసింది కాంగ్రెస్సేనని విజయన్‌ చెప్పారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దాన్ని ఉపయోగించుకుందని అన్నారు. మంత్రి మనీష్‌ శిసోడియాను అరెస్టు చేసినప్పుడు, కేజ్రివాల్‌ను ఎందుకు అరెస్టు చేయరని కాంగ్రెస్‌ ప్రశ్నించిందని విజయన్‌ గుర్తు చేశారు. సోమవారం కొజికోడ్‌లో విజయన్‌ విలేకర్లతో మాట్లాడారు.
బిజెపిలో చేరతారా లేదా జైలు శిక్షలను అనుభవిస్తారా అంటూ పలువురు కాంగ్రెస్‌ నేతలకు బెదిరింపులు వచ్చాయన్నారు. ”రాజకీయాల్లో అనేక ప్రతికూలతలను మీరు ఎదుర్కొనాల్సి వుంటుంది. అంతేకానీ రాజకీయాలను వదిలివేయడం సమస్యకు పరిష్కారం కాదు, ఆ శత్రువులపై, ప్రతికూలతలపై మీరు పోరాటం చేయాల్సి వుంటుంది. బిజెపిలోకి బలవంతంగా కాంగ్రెస్‌ నేతల వలసలను సమర్ధించలేం.” అని ఆయన అన్నారు. కేజ్రివాల్‌ అనుభవమనేది కాంగ్రెస్‌కు అతిపెద్ద గుణపాఠమని అన్నారు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యతనివ్వాలన్న అంశాన్ని కాంగ్రెస్‌ నేర్చుకోవాలని అన్నారు.
గత పదేళ్లకు పైగా అధికారంలో వుండి దేశ రాజ్యాంగ విలువలను, లౌకిక విలువలను బిజెపి ప్రభుత్వం నీరు గారుస్తున్నదని విజయన్‌ విమర్శించారు. లౌకికవాదం ఆలోచనపై ఆర్‌ఎస్‌ఎస్‌కు గల అసంతృప్తిని అమలు చేయడానికి ప్రయత్నిస్తోందన్నారు. మతోన్మాదాన్ని వ్యతిరేకించడం ద్వారా మాత్రమే లౌకికవాదాన్ని పరిరక్షించగలుగుతామన్నారు. ముస్లింలను లక్ష్యంగా చేసుకునే ఎన్‌సిఆర్‌ తీసుకువచ్చారని, కానీ అది అందరినీ ప్రభావితం చేస్తుందని తెలిపారు. కేరళలో చదువుకున్న వారి ఇళ్లల్లో కూడా వారి తండ్రుల, తాతల జనన వివరాలు లేవని చెప్పారు.

➡️