యువతకు కావల్సింది పకోడీ దుకాణాలు కాదు : కాంగ్రెస్‌

Jan 11,2024 12:41 #Congress, #PM Modi, #Unemployment

న్యూఢిల్లీ : దేశ యువతకు కావల్సింది మెరుగైన ఉద్యోగాలు కానీ, ‘ పకోడీ దుకాణాలు’ కాదని కాంగ్రెస్‌ గురువారం విమర్శించింది. పదేళ్ల మోడీ ప్రభుత్వ హయాంలో దేశంలో ‘ఉద్యోగాల కొరత’ తీవ్రస్థాయికి చేరుకుందని దుయ్యబట్టింది. ప్రతిఏడాది రెండు కోట్ల ఉద్యోగాలను కల్పిస్తామన్న హామీని నెరవేర్చడంలో ప్రధాని ఘోరంగా విఫలమయ్యారని ధ్వజమెత్తింది. నిరుద్యోగం, పకోడా దుకాణాలు కాకుండా మెరుగైన ఉద్యోగాలతో అభివృద్ధి చెందాలని దేశ యువత కోరుకుంటోందని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్‌ పేర్కొన్నారు.

సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ సమాచారం ప్రకారం.. 25-29 వయస్సు గల యువతలో నిరుద్యోగం నాలుగేళ్లలో అత్యధికమని, డిసెంబర్‌ 2023 నాటికి 15.5 శాతంగా ఉందని అన్నారు. అంటే కరోనా మహమ్మారి సమయంలో ఉన్న నిరుద్యోగం కన్నా ఇప్పుడు అధ్వాన్నంగా ఉందని మండిపడ్డారు. 20-24 సంవత్సరాల వయస్సు గల యువతలో నిరుద్యోగ రేటు 45.5శాతంతో గరిష్టస్థాయికి చేరుకుందని అన్నారు. 30-34 వయస్సులో నిరుద్యోగ రేటు మూడేళ్ల గరిష్టానికి చేరింది.

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ సంక్షోభం మరింత తీవ్రంగా ఉందని అన్నారు. ఇతర ఉద్యోగాలు అందుబాటులో లేకపోవడంతో అధిక శాతం కుటుంబాలు గ్రామీణ ఉపాధి పథకం వైపు మళ్లుతున్నాయని అన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న వాగ్దానాన్ని ప్రధాని మోడీ నెరవేర్చలేదనడాన్ని ఈ ఆధారాలు స్పష్టం చేస్తున్నాయని జైరాం రమేష్‌ పేర్కొన్నారు.

➡️