కేరళలో కోవిడ్‌ సబ్‌వేరియంట్‌ జెఎన్‌.1 కేసులు

Dec 16,2023 16:07 #covid, #kerala

 

న్యూఢిల్లీ : కేరళలో కోవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఆ రాష్ట్రంలో కోవిడ్‌ సబ్‌వేరియంట్‌ జెఎన్‌.1 కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త సబ్‌ వేరియంట్‌.. ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ బిఎ.2.86కి వంశానికి చెందినది అని ద ఇండియా సార్స్‌ -కోవ్‌-2 జెనోమిక్స్‌ కన్సార్టియం (ఐఎన్‌ఎస్‌ఎసిఓజి) ఏజెన్సీ వెల్లడించింది. ఈ కోవిడ్‌ సబ్‌ వేరియంట్‌ ఆందోళనల్ని కలిగిస్తుందని ఐఎన్‌ఎస్‌ఎసిఓజి ఏజెన్సీ చీఫ్‌ ఎన్‌కె.అరోరా తెలిపారు. ‘ఈ వేరియంట్‌ను నవంబర్‌లో గుర్తించడం జరిగింది. ఇది బిఎ.2.86 యొక్క సబ్‌ వేరియంట్‌. అయితే ఈ వైరస్‌ సోకినవారు ఆసుపత్రిలో చేరినట్లుగా నివేదికలేవు. ఇది తీవ్రమైన వ్యాధి అని ఇప్పటివరకు నిర్ధారించలేదు. జెన్‌.1 కేసులు ఈ ఏడాది సెప్టెంబర్‌లో అమెరికాలో వెలుగుచూశాయి.’ అని అన్నారు. కాగా, నేషనల్‌ ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ కోవిడ్‌ టాస్క్‌ ఫోర్స్‌ కో ఛైర్మన్‌ రాజీవ్‌ జయదేవన్‌ మాట్లాడుతూ.. ‘ఏడు నెలల తర్వాత భారత్‌లో కోవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం కేరళలోని పలు ప్రాంతాల్లో కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. గతంలోలాగే కోవిడ్‌ వైరస్‌ వ్యాప్తి తీవ్రత పెరిగే అవకాశం కనిపిస్తోంది. తాజా జెఎన్‌.1 వేరియంట్‌ వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇది ఎక్స్‌బిబి వేరియంట్‌, మిగతా వేరియంట్‌ల కన్నా భిన్నంగా ఉంది. గతంలో కోవిడ్‌ సోకినవారికి, టీకాలు వేసుకున్న వ్యక్తులకు కూడా ఈ వైరస్‌ సోకే అవకాశం ఉంది. జెఎన్‌.1 వైరస్‌ అనేక పాశ్చాత్య దేశాల్లో వేగంగా వ్యాప్తి చెందుతోంది. అంతర్జాతీయ ప్రయాణాల వల్ల మన దేశంలో కూడా ఈ కేసులు పెరిగే అవకాశం ఉంది.’ అని ఆయన అన్నారు.

➡️