మతోన్మాద, కార్పొరేట్‌ శక్తులపై పోరాటం అంబేద్కర్‌కు అదే నిజమైన నివాళి

Dec 7,2023 09:22 #BR Ambedkar, #Communalism, #cpm
cpm condolence to ambedkar death annisavery

సీతారాం ఏచూరి
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : మతోన్మాద, కార్పొరేట్‌ శక్తులకు వ్యతిరేకంగా పోరాడటమే రాజ్యాంగ నిర్మాణ డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌కు మనమిచ్చే నిజమైన నివాళి అని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. అంబేద్కర్‌ 67వ వర్ధంతి సందర్భంగా బుధవారం నాడిక్కడ అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఎఐఎడబ్ల్యుయు), దళిత్‌ శోషణ్‌ ముక్తి మంచ్‌ (డిఎస్‌ఎంఎం) ఆధ్వర్యంలో సభ జరిగింది. తొలుత అంబేద్కర్‌ చిత్ర పటానికి పూల మాల వేసి, పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సభలో సీతారాం ఏచూరి మాట్లాడుతూ సామాజిక న్యాయం కోసం, అణగారిన ప్రజల పురోగతి కోసం అంబేద్కర్‌ ఎంతో కృషి చేశారని కొనియాడారు. అంబేద్కర్‌ ఆశయాలను మంట గలుపుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజాస్వామ్యంపైనా, రాజ్యాంగంపైనా దాడికి పూనుకుంటోందని ఏచూరి ఆందోళన వ్యక్తం చేశారు. అణగారిన ప్రజలకు, మహిళలకు వ్యరేకమైన మనువాద స్మృతిని తీసుకురావాలని మోడీ సర్కార్‌ కుట్రలు చేస్తోందని ఆయన విమర్శించారు. దేశంలో పేదరికం పోవాలంటే పేదలకు భూపంపణి చేయాలని అంబేద్కర్‌ కోరుకున్నారని ఏచూరి గుర్తు చేశారు. కానీ నేడు బిజెపి భూములను, సహజ వనరులను కార్పొరేట్‌ శక్తులకు ధారదత్తం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో మతోన్మాదానికి, కార్పోరేట్‌ వర్గాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎఐఎడబ్ల్యుయు ప్రధాన కార్యదర్శి బి వెంకట్‌, ప్రొఫెసర్‌ రమేష్‌ చంద్ర, అఖిల భారత కిసాన్‌ సభ (ఎఐకెఎస్‌) నాయకులు హన్నన్‌ మొల్లా, డిఎస్‌ఎంఎం నాయకులు నత్తు ప్రసాద్‌, ఎఐడిఆర్‌ఎం నేత నిర్మల్‌ తదితరులు ప్రసంగించారు.

➡️