అండగా ఉంటాం 

Feb 16,2024 08:05 #cpm leaders, #West Bengal
CPM counsel for Anarul Islam family
  • అనరుల్‌ ఇస్లాం కుటుంబానికి సిపిఎం పరామర్శ
  •  పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌

న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్‌ పోలీసుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన వామపక్ష కార్యకర్త అనరుల్‌ ఇస్లాం కుటుంబాన్ని సిపిఎం నాయకులు గురువారం పరామర్శించారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్‌ సలీం నేతృత్వంలోని సిపిఎం నాయకుల బృందం ఇస్లాం కుటుంబాన్ని పరామర్శించింది. ఈ సందర్భంగా ఇస్లాం కుటుంబ సభ్యులతో కలిసి మహమ్మద్‌ సలీం విలేకరులతో ఇస్లాం మరణానికి కారణమైన పోలీసులను శిక్షించాలని డిమాండ్‌ చేశారు. సిఐటియు, ఎఐకెఎస్‌ పిలుపు మేరకు ఈ నెల 13న పశ్చిమ బెంగాల్‌ వ్యాప్తంగా శాసనోల్లంఘన కార్యక్రమాలను నిర్వహించారు. ముర్షిదాబాద్‌ జిల్లా బర్హంపూర్‌లో శాంతియుతంగా శాసనోల్లంఘన కార్యక్రమం నిర్వహిస్తున్న వారిపై పోలీసులు కాల్పులు జరపడంతో అనరుల్‌ ఇస్లాం ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల అణచివేతతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50 మంది గాయపడ్డారు. బర్హంపూర్‌లో గాయపడిన వారు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ శాసనోల్లంఘన కార్యక్రమంలో మరో 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని బుధవారం కోర్టులో ప్రవేశపెట్టారు. రెండు రోజుల నుంచి వీరు పోలీసుల అదుపులోనే ఉన్నారు. కాగా, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులపై పోలీసులను ప్రయోగించిన పశ్చిమ బెంగాల్‌లోని టిఎంసి ప్రభుత్వంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులపై దాడికి పాల్పడుతున్న కేంద్రం, హర్యానాల్లోని బిజెపి ప్రభుత్వాలను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విరుచుకుపడుతున్నారని, అయితే రాష్ట్రంలోని రైతులపై ఆమె అదే విధంగా వ్యవహరిస్తున్నారని సిపిఎం, ఇతర వామపక్ష నాయకులు విమర్శిస్తున్నారు.

➡️