దభోల్కర్‌ కేసులో తీర్పుపై సిపిఎం అసంతృప్తి

May 11,2024 23:32 #cpm, #Dabholkar case, #unhappy

ముంబయి : ప్రముఖ హేతువాది డాక్టర్‌ నరేంద్ర దభోల్కర్‌ హత్య కేసులో తీర్పు అసంపూర్ణమైనదని, ఏమాత్రం సంతృప్తికరంగా లేదని సిపిఎం మహారాష్ట్ర రాష్ట్ర కమిటీ పేర్కొంది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఉదరు నర్కర్‌ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. మూఢ నమ్మకాల అవిశ్రాంతంగా పోరాడిన యోధుడు దభోల్కర్‌ను కాల్చి చంపిన ఇద్దరు దుండగులు సచిన్‌ అందూరే మరియు శరద్‌ కలస్కర్‌లకు పూణేలోని ప్రత్యేక కోర్టు యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధిస్తూ ఈ నెల 10న తీర్పు వెలువరించింది. ఈ మేరకు తీర్పును సిపిఎం అభినందించింది. అయితే ఇదే కేసులో కీలక సూత్రధారులైన మరో ముగ్గురు నిందితులు వీరేంద్ర తవాడే, అడ్వకేట్‌ సంజీవ్‌ పునలేకర్‌, విక్రమ్‌ భావే
నేరాన్ని నిరూపించడంలో కోర్టులో ప్రాసిక్యూషన్‌ విఫలం కావడంపై సిపిఎం అసంతఅప్తిని వ్యక్తం చేసింది. పర్యవసానంగా, శాస్త్రీయత కోసం పరితపించిన యోధుడిని దారుణంగా హత్య చేసిన కేసులో ప్రాసిక్యూషన్‌ వైఫల్యం కారణంగా ముగ్గురు దుండగులు నిర్దోషులుగా విడుదలయ్యారని ఆందోళన వ్యక్తం చేసింది. సరైన సాక్ష్యాధారులు సేకరించడంలో ప్రాసిక్యూషన్‌ విఫలమైందని, దీంతో సనాతన్‌ సంస్థ యొక్క ముగ్గురు దుండగులు శిక్ష నుంచి తప్పించకున్నారని తెలిపింది. మొదట్లో మహారాష్ట్ర పోలీసులు, ఆ తర్వాత సిబిఐ దశాబ్ద కాలం పాటు విచారణను సాగదీసి..చివరకు ఈ దారుణమైన నేరానికి సూత్రధారులను పట్టుకోవడంలో ఘోర వైఫల్యం చెందాయని సిపిఎం పేర్కొంది.

➡️