విరుచుకుపడుతున్న ‘మిచౌంగ్‌’ .. చెన్నైలో 8 మృతి

Dec 5,2023 11:04 #chennai, #Cyclone Michaung

న్యూఢిల్లీ/చెన్నై :   తుఫాను మిచౌంగ్‌ తీవ్రంగా విరుచుకుపడుతోంది. దీంతో ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా ఇప్పటివరకు చెన్నైలో ఎనిమిది మంది మరణించినట్లు అధికారులు తెలిపారు.

తుఫాను ధాటికి సముద్రం అల్లకల్లోలంగా మారింది. సముద్రపు అలలు 1-1.5 మీటర్లు ఎత్తుకు ఎగిసిపడుతున్నాయి. దీంతో వాతావరణ శాఖ కోస్తా జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. బాపట్ల మరియు కృష్ణా జిల్లాలపై తుఫాను ఉప్పెనలా విరుచుకుపే అవకాశం ఉందని హెచ్చరించింది. మంగళవారం తీరం దాటే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. గరిష్టంగా గంటకు 90-100 లేదా 110 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది.

తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమగోదావరి, కోనసీమ, కాకినాడ తదితర ఎనిమిది జిల్లాలకు ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. పుదుచ్చేరిలోని తీర ప్రాంతాల్లో సాయంత్రం 6 గంటల వరకు 144 సెక్షన్‌ విదించబడింది.

ప్రస్తుతం చెన్నైలో వర్షం నిలిచిపోయినప్పటికీ.. నగరంలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. వర్షాల కారణంగా ఎనిమిది మరణించినట్లు అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరదనీరు చేరింది. తమిళనాడు, పుదుచ్చేరిలో మంగళవారం చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ను పునరుద్ధరిస్తున్నారు. తుఫాను హెచ్చరికలతో చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలో విద్యా సంస్థలు, ఆఫీసులకు మంగళవారం కూడా ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

చెన్నై విమానాశ్రయంలో కార్యకలాపాలు నేడు పునరుద్ధరించబడ్డాయి. సోమవారం ఉదయం రన్‌వేపై నీరు చేరడంతో పలు విమానాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. వర్షం తగ్గడంతో అధికారులు రన్‌వేపై నీటిని తొలగించారు.

ఒడిశా ప్రభుత్వం కూడా ముందు జాగ్రత్త చర్యగా దక్షిణాది జిల్లాల్లో సహాయక బృందాలను మోహరించింది. మత్స్యకారులను సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు.

➡️