గ్రామీణ ప్రాంతాల్లో క్షీణించిన నిజ వేతనాలు !

May 5,2024 03:42 #Declining real, #rural areas, #Wages
  •  తగ్గిన డిమాండ్‌, కొనుగోలు శక్తి

న్యూఢిల్లీ : గ్రామీణ ప్రాంతాల్లో నిజ వేతనాలు బాగా తగ్గాయి. ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తి తీవ్రంగా క్షీణించింది. ఈ ఏడాది ఫిబ్రవరికి ముందున్న 27మాసాలకు గానూ 25మాసాల్లో వాస్తవిక వేతనాలు బాగా కుంచించుకుపోయాయి. ఫిబ్రవరి మాసంలో ఏకంగా 3.1శాతం మేర తగ్గాయి. అంతకుముందు, అత్యధికంగా వేతనాలు తగ్గిన సమయం అంటే 2022 సెప్టెంబరు. అప్పుడు 2.9శాతం మేర కుదించబడ్డాయి.
గ్రామీణ ద్రవ్యోల్బణం పెరుగుతుండడంతో ప్రత్యేకంగా ఈ ఏడాది ఫిబ్రవరికి ముందు నాలుగు మాసాల్లో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా వుంది. 2023 నవంబరు నుండి 2024 ఫిబ్రవరి మధ్య కాలంలో గ్రామీణ ప్రాంత కార్మికులు 7.1 నుండి 7.5శాతం మధ్య ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొన్నారు.
గత కొంత కాలం నుండి గ్రామీణ ప్రాంత వినిమయం బలహీనపడడం స్పష్టంగా కనబడుతోంది. ఉదాహరణకు చూసినట్లైతే, 2022తో పోలిస్తే 2023లో ట్రాక్టర్ల టోకు విక్రయాలు పూర్తిగా పడిపోయాయి. ఇటీవలి మాసాల్లో అంటే జనవరి-మార్చి త్రైమాసికంలో ఈ పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. 2023లో ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఏకంగా 23శాతం మేర క్షీణించాయి.
2024 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో గ్రామీణ వినిమయం అంతకుమందు సంవత్సరంలో ఇదే కాలంతో పోలిస్తే కేవలం 0.5శాతం పెరిగింది. గత 8 త్రైమాసికాల్లోనే అత్యంత తక్కువగా నమోదైనది ఇదే అని మోతీలాల్‌ ఓస్వాల్‌ జరిపిన విశ్లేషణలో వెల్లడైంది. అకాల వర్షాలు ఖరీఫ్‌ దిగుబడిని తీవ్రంగా దెబ్బతీయడంతో 2023లో కొంత సమయంలో గ్రామీణ రికవరీ బాగా మందగించిందని అనేక సంఘటిత వినిమయ కంపెనీలు పేర్కొన్నాయంటూ నొమురా విశ్లేషకులు తెలిపారు. మార్చి త్రైమాసికం తర్వాత పలు కంపెనీల ఆదాయ ప్రకటనలను చూస్తే గ్రామీణ వినిమయం పుంజుకోవడానికి కొంత సమయం పట్టవచ్చని తెలుస్తోంది. మార్చి త్రైమాసికంలో హిందూస్తాన్‌ యూనీ లీవర్‌ (హెచ్‌యుఎల్‌) కేవలం ఒక్క శాతాన్ని మాత్రమే వృద్ధిని నమోదు చేసింది. గ్రామీణ ప్రాంత డిమాండ్‌ బలహీనంగా వుండడం ఇందుకు కొంత కారణంగా వుంది. వ్యవసాయ ఆదాయాలు, కార్మిక ఆదాయాలు, స్వదేశానికి వచ్చే ఆదాయాలపై గ్రామీణ ప్రాంతాలు పుంజుకోవడం లేదా కోలుకోవడం ఆధారపడి వుంటుందని హెచ్‌యుఎల్‌ మేనేజ్‌మెంట్‌ వ్యాఖ్యానించింది. ఇక మార్చి త్రైమాసికంలో స్వల్పంగా మెరుగుదల వుందని డాబర్‌ కంపెనీ యాజమాన్యం తెలిపింది.
వ్యవసాయ రంగానికి జోడించబడిన స్థూల విలువ (జివిఎ) అంతకుముందు ఏడాది 5.2శాతం గా వున్నా 2023-2024 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 0.8శాతం మేర కుంచించుకుపోయింది. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో పేలవమైన పనితీరు కనబరిచింది. అంటే కేవలం 1.6 వృద్ధిని నమోదు చేసింది. దీన్ని బట్టి చూస్తే, 2024 ఆర్థిక సంవత్సరంలో ఈ రంగం ఒక శాతం కన్నా వృద్ధి చెందలేదని తెలుస్తోంది.

➡️