ఉద్యోగాల కోసం డివైఎఫ్‌ఐ ‘ఇన్సాఫ్‌ యాత్ర’

dyfi-insaf-rally

బెంగాల్‌లో యువకులు, ప్రజల నుంచి భారీ స్పందన
కోల్‌కతా, బరహంపూర్‌ : యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల కోసం డెమొక్రటిక్‌ యూత్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డివైఎఫ్‌ఐ) ఆధ్వర్యాన పశ్చిమ బెంగాల్‌లోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన ‘ఇన్సాఫ్‌ యాత్ర’కు భారీ స్పందన లభిస్తోంది. ఈ యాత్రలో యువకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి మీనాక్షి ముఖర్జీ, అధ్యక్షులు ధృవజ్యోతి సాహా నాయకత్వాన కూచ్‌బీహార్‌లో ప్రారంభమైన ఈ యాత్ర అలీపుర్‌ దువార్‌లోని టీ గార్డెన్స్‌, సిలిగురి టౌన్‌, ఉత్తర దినాజ్‌పూర్‌, మాల్దా జిల్లాల మీదుగా సాగింది. ఉత్తర దినాజ్‌పూర్‌ మాల్దాలోని రారుగుంగేలో భారీ ర్యాలీలు నిర్వహించారు. మీనాక్షి ముఖర్జీ, ఇతర డివైఎఫ్‌ఐ నాయకులు ప్రసంగించారు. 13 రోజుల్లో కాలినడకన సుమారు 300 కిలోమీటర్ల మేర ముఖర్జీ యాత్రలో పాల్గొన్నారు. రాష్ట్రప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవడంతో యువకులు ఇతర రాష్ట్రాలలో చిన్న ఉద్యోగాల కోసం వలసపోతున్నారని విమర్శించారు. వీరిలో చాలామంది చనిపోతున్నారని, శవపేటికలలో తిరిగి వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికంగా ఉద్యోగాలతోనే ఇలాంటి విషాదాలను నిరోధించవచ్చని అన్నారు. కాంట్రాక్ట్‌ కార్మికులు హక్కుల కోసం కూడా పోరాటం చేస్తున్నారని చెప్పారు. ఫరక్కాలో విద్యుత్‌ కేంద్రంలోని ఒప్పంద కార్మికుల గురించి ప్రస్తావించారు. ‘దేశం, రాష్ట్రంలో జరుగుతున్న అన్ని రకాల అన్యాయాలను ప్రశ్నిస్తున్నాం. జనవరి 7న డివైఎఫ్‌ఐ బ్రిగేడ్‌ ర్యాలీలో ఈ సమస్యలను లేవనెత్తుతాం. టిఎంసి, బిజెపి ప్రభుత్వాలు చేస్తున్న అన్యాయాలపై డివైఎఫ్‌ఐ తన పోరాటాన్ని కొనసాగిస్తుంది’ అని ముఖర్జీ స్పష్టం చేశారు. అవినీతి మంత్రులు, నాయకులతో రాష్ట్రంలోని టిఎంసి ప్రభుత్వం ఉందని విమర్శించారు. బిజెపి మత రాజకీయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెడుతున్నాయని డివైఎఫ్‌ఐ నాయకులు తెలిపారు.

➡️