మరో ఆప్‌ ఎమ్మెల్యే వేటు వేసేందుకు సిద్ధమైన ఇడి

న్యూఢిల్లీ :   మరో ఆప్‌ నేతపై వేటు వేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) సిద్ధమైంది. ఆప్‌ పార్టీ ఓఖ్లా ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌పై అరెస్ట్‌ వారెంట్‌ కోరుతూ ఇడి బుధవారం ఢిల్లీ కోర్టుకు వెళ్లింది. ఢిల్లీ వక్ఫ్‌ బోర్డ్‌ నియామకాల్లో అవకతవకలకు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఆయనను విచారణ చేయాలని ఇడి కోరింది. అయితే దరఖాస్తుకు మద్దతుగా కొన్ని పత్రాలు దాఖలు చేయడానికి ఇడి సమయం కోరడంతో సిబిఐ, ఇడి ప్రత్యేక న్యాయమూర్తి రాకేష్‌ సియాల్‌ విచారణను ఏప్రిల్‌ 18కి వాయిదా వేశారు.

ఢిల్లీ సంక్షేమ శాఖ మంత్రి రాజ్‌కుమార్‌ ఆనంద్‌ బుధవారం తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కేబినెట్‌, పార్టీ పదవులను వదులకున్నారు. బిజెపి బెదిరింపులు, ఒత్తిడి కారణంగానే రాజ్‌కుమార్‌ రాజీనామా చేసి ఉండవచ్చని ఆప్‌ నేత, ఢిల్లీ మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌ తెలిపారు. ఓ దళిత ఎమ్మెల్యేను ఈ విధంగా బెదిరిస్తే సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాలని అన్నారు. ఆప్‌ను అంతం చేయాలని బిజెపి కోరుకుంటోందని ఆప్‌ ఎంపి సంజరు సింగ్‌ పేర్కొన్నారు. ఇడి, సిబిఐలను ప్రయోగించి తన మంత్రులను, ఎమ్మెల్యేలను చీల్చుతోందని, ఇది తమకు ఓ అగ్ని పరీక్షలాంటిదన్నారు.

➡️