జార్ఖండ్‌ సిఎంకు మళ్లీ సమన్లు

ed-summons-jharkhand-cm-hemant-soren

రాంచీ : మనీ లాండరింగ్‌ కేసులో జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సొరేన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మరోసారి సమన్లు జారీ చేసింది. స్టేట్‌మెంటును రికార్డు చేసేందుకు వీలుగా ఈ నెల 27-31 తేదీల మధ్య హాజరు కావాలని సూచించింది. రాంచీలోని 7.16 ఎకరాల భూమిపై యాజమాన్యానికి సంబంధించి ఈ కేసు నమోదైంది. సైన్యానికి చెందిన భూమిని చట్టవిరుద్ధంగా విక్రయించారని ఈడీ ఆరోపించింది. ఈ కేసులో ఇప్పటికే 13 మందిని అరెస్ట్‌ చేశారు. సొరేన్‌ను ఈడీ అధికారులు శనివారం ఆయన నివాసంలో ఏడు గంటల పాటు ప్రశ్నించారు. అంతకుముందు ఈడీ ఏడుసార్లు సమన్లు జారీ చేసినప్పటికీ సొరేన్‌ స్పందించలేదు. ఎనిమిదో సారి సమన్లు జారీ చేసినప్పుడు మాత్రం విచారణకు హాజరయ్యేందుకు అంగీకరించారు. తన ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సొరేన్‌ విమర్శించారు. నోటీసులపై మీడియాతో ఆయన మాట్లాడుతూ ‘మీ మద్దతుతో, గిరిజనుల ఆశీర్వాదంతో ఓ ఆదివాసీ వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యారు. బిజెపి నాయకులు రాజకీయంగా నన్ను ఏమీ చేయలేరు. అందువల్ల తెరచాటున ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఈ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ఎవరు ప్రయత్నించినా వారికి భంగపాటు తప్పదు’ అని హెచ్చరించారు.

➡️