భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడమే 

Editors Guild condemns attack on Wagle

వాగ్లేపై దాడిని ఖండించిన ఎడిటర్స్‌ గిల్డ్‌

న్యూఢిల్లీ : మహారాష్ట్రలోని పూనేలో సీనియర్‌ పాత్రికేయుడు నిఖిల్‌ వాగ్లేపై జరిగిన దాడిని ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా (ఈజీఐ) తీవ్రంగా ఖండించింది. వాగ్లే, మరి కొందరు పోలీసు రక్షణతో కారులో ప్రయాణిస్తుండగా ఓ రాజకీయ పార్టీకి చెందిన మితవాదులు ఆ వాహనంపై దాడి చేసి ధ్వంసం చేశారు. ‘నిర్భరు బానో’ కార్యక్రమంలో పాల్గొనేందుకు వాగ్లే, మానవ హక్కుల న్యాయవాది అసీం సరోద్‌, హక్కుల కార్యకర్త విషంభర్‌ చౌదరి కారులో వెళుతుండగా ఈ ఘటన జరిగింది. రాష్ట్ర సేవాదళ్‌ అనే సంస్థ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌కే అద్వానీకి ఇటీవల కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించడంపై వాగ్లే విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై దాడి జరిగిందని భావిస్తున్నారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఎడిటర్స్‌ గిల్డ్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. వాగ్లే తన అభిప్రాయాన్ని తెలియజేశారని, ఈ కారణంతో ఆయనపై దాడి చేయడం చట్టవిరుద్ధం, అక్రమమని తెలిపింది. దాడికి బాధ్యులైన వారిపై కేసు నమోదు చేయాలని, వాగ్లేకు రక్షణ కల్పించాలని, ఆయన భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడాలని అధికారులను, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. వాగ్లేపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడంపై కూడా ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆందోళన వ్యక్తం చేసింది. పాత్రికేయులను భయపెట్టేందుకు, వేధించేందుకు క్రిమినల్‌ చట్టాలను దుర్వినియోగం చేయడాన్ని ఖండించింది. పాత్రికేయులపై వచ్చే ఫిర్యాదులను ఎఫ్‌ఐఆర్‌లుగా నమోదు చేసేటప్పుడు సంయమనం పాటించాలని, లేకుంటే విచారణ ప్రక్రియే శిక్షగా మారుతుందని ఎడిటర్స్‌ గిల్డ్‌ తెలిపింది.

➡️