ముగిసిన పార్లమెంటు

Feb 11,2024 08:23 #End, #Parliament
  • 17వ లోక్‌సభకు తెర
  • కొరవడిన ప్రభుత్వ జవాబుదారీ
  • చివరి రోజు శ్వేత పత్రంపై వాడివేడి చర్చ
  • రామ మందిర నిర్మాణంపై ప్రభుత్వాన్ని అభినందిస్తూ తీర్మానం

ప్రజాశక్తి- న్యూఢిల్లీ బ్యూరో : పదిహేడవ లోక్‌సభ పదవీ కాలం దాదాపు ముగిసింది. ఈ అయిదేళ్లలో లోక్‌సభ పనితీరు భేషుగ్గా ఉందని స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించగా, చెప్పుకోవడానికి ఏమున్నది గర్వకారణమని ప్రతిపక్షాలు పెదవి విరిచాయి. లోక్‌సభ 97 శాతం ఫలితం సాధించిందని స్పీకర్‌ చెప్పగా, పార్లమెంటుకు ప్రభుత్వ జవాబుదారీ ఏదీ అని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. పార్లమెంటు చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్షాల నోరు నొక్కేశారని విమర్శించాయి. లోక్‌సభ చివరి రోజు సమావేశంలో రాజ్యాంగ మౌలిక స్పూర్తిని మంటగలిపేలా అధికార బిజెపి వ్యవహరించిందని ప్రతిపక్ష ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 17వ లోక్‌సభ చివరి రోజు సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శ్వేతపత్రంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ప్రతిపక్షాలు మోడీ ప్రభుత్వ అసమర్థ నిర్వాకాన్ని ఉతికి ఆరేశాయి. ఆర్థిక మంత్రి పొంతనలేని ప్రకటనలతో సభను తప్పుదోవ పట్టించారని ధ్వజమెత్తాయి. 2004-2009 మధ్య కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ మంచి మెరుగైన స్థితిలో ఉందని ఇంతకుముందు చెప్పిన ఇదే ఆర్థిక మంత్రి ఇప్పుడీ శ్వేత పత్రంలో అందుకు విరుద్ధమైన చిత్రాన్ని చూపడాన్ని వారు ఎత్తి చూపారు. అదలావుంచితే మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను రెండు రోజుల క్రితమే ప్రధాని మోడీ గొప్పగా పొగడగా, ఈ శ్వేతపత్రంలో ఆయన పాలనలో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని నిర్మలా సీతారామన్‌ పేర్కొనడంలో ఔచిత్యమేమిటని కాంగ్రెస్‌ ఎంపీ వేణుగోపాల్‌ ప్రశ్నించారు. ఇది శ్వేత పత్రం కాదు, ఎన్నికల పత్రంగా ఉందని ప్రతిపక్షాలు విమర్శించాయి. మోడీ ప్రభుత్వం గత పదేళ్లలో సాధించిన ‘విజయాలు’ గురించి ఏకరువుపెట్టగా, ప్రభుత్వ వాగ్దాన భంగాల గురించి ప్రతిపక్షాలు సూటిగా ప్రస్తావించాయి.

శనివారం రాజ్యసభలో శ్వేతపత్రంపై జరిగిన చర్చలో సిపిఐ(ఎం) ఎంపీ జాన్‌ బ్రిట్టాస్‌ మాట్లాడు తూ, వామపక్షాల మద్దతుతో ఏర్పడిన యుపిఏ-1 ప్రభుత్వం ఆహార హక్కు, ఏడాదికి వంద రోజుల పని గ్యారెంటీ కల్పించే మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, ఆదివాసీ హక్కుల పరిరక్షణ చట్టం, సమాచార హక్కు చట్టం వంటి ఎన్నో ప్రగతిశీల చట్టాలను తెచ్చింది. మోడీ పాలనలో సామాన్య ప్రజలకు మేలు చేకూర్చే ఒక్క చట్టమైనా తెచ్చారా అని అధికార పక్షాన్ని సూటిగా ప్రశ్నించారు. బిజెపి అదేపనిగా డబ్బా కొట్టుకుంటున్న ‘మోడీకా గ్యారెంట’ీ గురించి బ్రిట్టాస్‌ ప్రస్తావిస్తూ, మునుపటి గ్యారెంటీలు ఏమయ్యాయని ప్రశ్నించా రు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామ న్నారు, ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టారు. విదేశాల్లో వున్న నల్లధనాన్ని వందరోజుల్లో వెనక్కి రప్పించి, దేశంలోని ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు జమ చేస్తామని అన్నారు. ఒక్క పైసా అయినా జమ చేశారా? అని నిలదీశారు. పార్లమెంటు క్యాంటీన్‌లో సబ్సిడీలు తగ్గించి ప్రజా ధనాన్ని ఆదా చేశామని చెబుతున్నారు, మరి మోడీ చిత్రంతో సెల్ఫీ కార్నర్ల ఏర్పాటుకు ప్రజల డబ్బును దుర్వినియోగం చేయడం నిజం కాదా అని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. శ్వేతపత్రంపై చర్చ ముగియగానే రామ మందిర నిర్మాణంలో ప్రభుత్వ కృషిని అభినందిస్తూ అధికార పక్ష సభ్యులు తీర్మానం తీసుకొచ్చారు. రాజ్యాంగానికి కట్టుబడి వుండాల్సిన ప్రభుత్వం రాజ్యాంగ మౌలిక లక్షణమైన లౌకికవాదాన్ని గుర్తించబోదన్నట్లుగా బిజెపి సభ్యుని మాట్లాడే తీరు ఉందని సిపిఐ(ఎం) ఎంపీ బ్రిట్టాస్‌ విమర్శించారు. అంతకుముందు బిజెపి ఎంపీ ఒకరు మాట్లాడుతూ, ‘మనం హిందువులం, మక్కాకు వెళ్లడానికి ఎలా అనుమతించరో, రామ మందిరంలోకి కూడా హిందువులు కానివారిని అనుమతించ రాదు’ అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. జనవరి22న రాహుల్‌ గాంధీ అయోధ్యలో కార్యక్రమానికి హాజరుకాకపోవడాన్ని బిజెపి ఎంపీ విమర్శించారు.

➡️